పెన్‌డ్రైవ్‌ మూలమూలనా శోధన | Sakshi
Sakshi News home page

పెన్‌డ్రైవ్‌ మూలమూలనా శోధన

Published Fri, May 17 2024 7:35 AM

పెన్‌డ్రైవ్‌ మూలమూలనా శోధన

బనశంకరి/ మైసూరు: హాసన్‌ జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ నగ్న వీడియోల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అన్ని పార్టీల నాయకులు ఇందులో ఇరుక్కుపోతున్నారు. వీడియోల లీకేజీ వ్యవహారంలో హాసన్‌ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రీతమ్‌గౌడ ఆప్తుని ఇంట్లో 10 కి పైగా పెన్‌డ్రైవ్‌లతో పాటు ముఖ్యమైన ఆధారాలు లభించాయి. బెంగళూరు, హాసన్‌తో పాటు అనేక ప్రాంతాల్లో సిట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 7 పెన్‌డ్రైవ్‌లు, 6 హార్డ్‌డిస్క్‌లు, 4 ల్యాప్‌టాప్‌లు, మూడు డెస్క్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల స్టోరేజీని సేకరించి పరిశీలిస్తున్నారు. పెన్‌డ్రైవ్‌లు, కంప్యూటర్లలో ఉన్న వీడియోలను పరిశీలిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. వీడియోలను పెన్‌డ్రైవ్‌ ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌కు కాపీ చేసిన తరువాత ఇతరులకు పంపించారనే ఆరోపణ ఉంది. అందులో ప్రీతమ్‌గౌడ సన్నిహితులైన క్వాలిటీబార్‌ శరత్‌, పునీత్‌, హెచ్‌పీ కిరణ్‌, కాంగ్రెస్‌ కార్యకర్త పుట్టరాజు, నవీన్‌గౌడ, కారు డ్రైవరు కార్తీక్‌, శశి, చేతన్‌గౌడల ఇళ్లలో సోదాలు చేపట్టారు. మరోవైపు బెంగళూరుకు ఏ క్షణమైనా రావచ్చు అనుకున్న ఎంపీ ప్రజ్వల్‌ ఆచూకీ లేడు.

ప్రజ్వల్‌ ఎక్కడున్నాడో తెలియదు: జీటీ

విదేశాలకు వెళ్లిన ఎంపీ ప్రజ్వల్‌ ఇప్పటివరకు ఎవరికి అందుబాటులోకి రాలేదని జేడీఎస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ అన్నారు. గురువారం నగరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రజ్వల్‌ రేవణ్ణతో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఎక్కడున్నాడో తెలియరాలేదని, 196 దేశాల్లో బ్లూకార్నర్‌ నోటీసు జారీ చేసిన సిట్‌ అధికారులే ఆయన ఆచూకీ కనుగొనాలని కోరారు. పెన్‌డ్రైవ్‌లను తయారు చేసింది, అప్‌లోడ్‌ చేసింది చైన్నె, మలేసియాలో అని తెలుస్తోందని, అందుకే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. బీజేపీతో జేడీఎస్‌ మైత్రి విడదీయలేనిదని చెప్పారు.

రేవణ్ణకు మరో కేసులో బెయిలు

మహిళపై లైంగిక దాడి కేసులో హెచ్‌డీ రేవణ్ణకు బెయిల్‌ మంజూరైంది. బెంగళూరు 42వ ఏసీఎంఎం కోర్టులో రేవణ్ణ బెయిలు అర్జీపై గురువారం విచారణ సాగింది. ఆయనకు బెయిల్‌ ఇవ్వరాదని సిట్‌ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. కోర్టు ఇరుపక్షాల వాదనలను ఆలకించి బెయిలు మంజూరు చేసింది.

హాసన్‌ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఆప్తుల ఇళ్లలో సిట్‌ సోదాలు

పెద్దసంఖ్యలో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్కులు సీజ్‌

తిమింగలాన్ని మింగేస్తా: కుమార

మింగే కాలం వచ్చినప్పుడు పెద్ద తిమింగలాన్నే మింగేస్తానని జేడీఎస్‌ మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి పరోక్షంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై మండిపడ్డారు. అశ్లీల వీడియోల వెనుక ఉన్న తిమింగలం డీకేశి అని కుమార తరచూ ఆరోపిస్తున్నారు. గురువారం మైసూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రజ్వల్‌ ఎంపీగా అయ్యాక తమకు అందుబాటులో లేకుండా పోయాడన్నారు. ఇక విదేశాల్లో ఉంటే తనతో ఎలా మాట్లాడతాడని ప్రశ్నించారు. ప్రజ్వల్‌ కేసులో ప్రభుత్వానికి నిజాలు అవసరం లేదని, జేడీఎస్‌, దేవెగౌడ కుటుంబ మర్యాదను పాడు చేస్తే చాలనుకుంటోందని విమర్శించారు. సిట్‌ తనిఖీ సరిగ్గా జరగడం లేదని, న్యాయవాది దేవరాజేగౌడను కేసు నమోదు అయిన నెల రోజుల తర్వాత ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. అధికారుల బదిలీల అవినీతిపై ఆధారాల పెన్‌డ్రైవ్‌ను ఇస్తాను, విచారణకు సిద్ధమా అని అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement