కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలే | Sakshi
Sakshi News home page

కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలే

Published Fri, Apr 19 2024 4:51 AM

CEO Vikasraj disclosed in the press conference - Sakshi

ఇప్పటికే కొందరిపై ఈసీ చర్యలు తీసుకుంది 

ప్రచారంలో పాల్గొనకుండా వారిపై నిషేధం విధించింది 

ఈసీ నోటీసులకు వివరణ కోసం కేసీఆర్‌ వారం గడువు కోరారు 

ఈ నెల 26 నుంచి ఓటర్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్పుల పంపిణీ  

విలేకరుల సమావేశంలో సీఈఓ వికాస్‌రాజ్‌ వెల్లడి 

రాజాసింగ్, మాధవీలత విద్వేష ప్రసంగాలపై సమాధానం దాటవేత 

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటోందని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇప్పటికే పలువురు నేతలపై నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ చెప్పారు.

రాష్ట్రంలో సైతం కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ పట్ల అన్ని పార్టీలకు అవగాహన కల్పించామని, ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

కోడ్‌ ఉల్లంఘన ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఈసీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చే గడువు గురువారంతో ముగిసిందని, ఆయన మరో వారంపాటు గడువు పొడిగించాలని కోరారన్నారు. కేసీఆర్‌ విజ్ఞప్తిని ఈసీకి పంపించామని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఊరేగింపులో ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్, ఆ పార్టీ హైదరాబాద్‌ అభ్యర్థి మాధవీలత చేసిన విద్వేషకర ప్రసంగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.

కోడ్‌ ఉల్లంఘనకి సంబంధించి ఇప్పటి వరకు వివిధ పార్టీల నుంచి 28 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 4099 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశామన్నారు. ఓ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడానికి అనుమతించే విషయమై చట్టాలను పరిశీలించాల్సిన అవసరముందని తెలిపారు. సికింద్రాబాద్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పోటీకి దిగుతున్న విషయం తెలిసిందే.  

ఆన్‌లైన్‌లో నామినేషన్‌ వేయొచ్చు
ఆన్‌లైన్‌లో సైతం నామినేషన్‌ దాఖలు చేయొ చ్చని, అయితే ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల్లోపు అభ్యర్థులు సంతకం చేసిన నామినేషన్‌ పత్రాల ప్రింట్‌ కాపీని సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని వికాస్‌రాజ్‌ తెలిపారు. నామినేషన్‌ ఫారంతోపాటు అఫిడవిట్‌లోని అన్ని ఖా ళీలను పూరించాలని, తమకు వర్తించని విష యాలను సైతం ‘నాట్‌ అప్లికేబుల్‌’అని రా యాల్సి ఉంటుందన్నారు.

ఒక్క ఖాళీ పూరించకపోయినా పరిశీలనలో నామినేషన్లు తిరస్కరిస్తారని చెప్పారు. ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు కొత్త బ్యాంక్‌ ఖాతాను తెరవాల్సి ఉంటుందని, రాష్ట్రంలోని ఏ బ్యాంక్‌ నుంచైనా ఖాతా తెరవచ్చన్నారు. తొలి రోజు రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 42 మంది అభ్యర్థులు మొత్తం 48 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారని వికాస్‌రాజ్‌ వెల్లడించారు.

23లోగా పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు చేసుకోవాలి 
పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కోసం వికలాంగు లు, 85 ఏళ్లుపైబడిన వయోజనులు, అత్యవసర సేవల ఉద్యోగులు/జర్నలిస్టులు ఈ నెల 23లోగా ఫారం–12డీ దరఖాస్తులను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలని సీఈఓ వికాస్‌రాజ్‌ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇంకా 40వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోలేదని, తక్షణమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.

మే 3 నుంచి 6 వరకు తొలి విడత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి ఓటర్లకు ఓటర్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్పుల పంపిణీ చేస్తామన్నారు. పాత ఓటరు గుర్తింపుకార్డులు కలిగిన 46 లక్షల మంది ఓటర్లకు వారి కొత్త ఓటరు గుర్తింపుకార్డు నంబర్లను తెలియజేస్తూ లేఖలు పంపినట్టు తెలిపారు. పాత నంబర్లతో ఓటు ఉండదని, కొత్త నెంబర్లతోనే ఉంటుందన్నారు.    

మహిళా ఓటర్లే అధికం 
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,31,48,527కి చేరిందని వికాస్‌రాజ్‌ తెలిపారు. 1000 మంది పురుషులకు రాష్ట్రంలో 1010 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు మొత్తం 1,00,178 దరఖాస్తులొచ్చాయని, వీటిని ఈనెల 25లోగా పరిష్కరిస్తామని చెప్పారు. 2022–24 మధ్యకాలంలో రాష్ట్రంలో 60.6 లక్షల కొత్త ఓటర్ల నమోదు, 32.84 లక్షల ఓటర్ల తొలగింపు, 30.68 లక్షల ఓటర్ల వివరాల సవరణ జరిగిందన్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement