అంగన్‌వాడీల రిటైర్మెంట్లు షురూ! | Retirements of Anganwadis have started | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల రిటైర్మెంట్లు షురూ!

Published Thu, May 2 2024 4:20 AM | Last Updated on Thu, May 2 2024 4:20 AM

Retirements of Anganwadis have started

65ఏళ్లు పూర్తయిన టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణకు రంగం సిద్ధం 

వారి వయోపరిమితి వివరాలను తెప్పించుకున్న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ 

∙ప్యాకేజీపై అంగన్‌వాడీ ఉద్యోగ సంఘ నేతల అసంతృప్తి 

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో పదవీ విరమణ ప్రక్రియకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రంగం సిద్ధం చేసింది. కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ ప్యాకేజీపై నిర్ణయం తీసుకోవడం.. మరోవైపు వయోపరిమితి సడలింపు తర్వాత ఈ ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ల ప్రక్రియ షురూ కావడంతో అంగన్‌వాడీల రిటైర్మెంట్ల పర్వానికి తెరలేచింది. 

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమాచార సేకరణను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చేపట్టింది. ఉద్యోగంలో చేరిన తేదీ మొదలు, జిల్లా, ప్రాజెక్టు వివరాలు, వారి పుట్టిన తేదీ, వయసు తదితర వివరాలను నిరీ్ణత ప్రొఫార్మాలో  క్షేత్రస్థాయిలో జిల్లా సంక్షేమాధికారి(డీడబ్ల్యూఓ), శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి(సీడీపీఓ)ల నుంచి తెప్పించుకుంది. 

గత నెలాఖరు నుంచే రిటైర్మెంట్లు 
ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి మూడేళ్ల పెంపు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదవీ విరమణలు మార్చి నెల నుంచే మొదలయ్యాయి. అయితే నూతన వార్షిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కావడంతో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు మాత్రం ఏప్రిల్‌ నెలాఖరు నుంచి రిటైర్మెంట్లు అమలు చేయాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది.

 ఈ క్రమంలో ఏప్రిల్‌ నెలతో 65 సంవత్సరాలు పూర్తయిన టీచర్లు, హెల్పర్ల వివరాలను ఆ శాఖ సేకరించింది.  65ఏళ్లు పూర్తి చేసుకున్న అంగన్‌వాడీ టీచర్‌కు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్యాకేజీ రూపంలో ప్రభుత్వం అందించనుంది. అదేవిధంగా మినీ అంగన్‌వాడీ సెంటర్‌ టీచర్, అంగన్‌వాడీ హెల్పర్‌కు రిటైర్మెంట్‌ ప్యాకేజీ కింద రూ.50వేలు అందించనుంది. రిటైర్మెంట్‌ సమయం నుంచి వారికి ఆసరా పింఛన్‌ ఇచ్చేలా ప్యాకేజీలో ఉంది. 

ఏడాది చివరికల్లా 5వేల మంది... 
రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్చర్లు దాదాపు 50వేల మంది పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటివరకు పదవీ విరమణకు సంబంధించి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించే అంశం లేదు. తాజాగా ప్యాకేజీని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి పదవీ విరమణ ప్రక్రియను చేపడుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 5వేల మంది టీచర్లు, హెల్పర్లు రిటైర్మెంట్‌ కానున్నట్లు సమాచారం. 

రిటైర్మెంట్‌ ప్యాకేజీ సమ్మతంగా లేదు 
రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ల రిటైర్మెంట్‌ ప్యాకేజీ ఏమాత్రం న్యాయసమ్మతంగా లేదు. టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇవ్వాలని గత ప్రభుత్వం ఎదుట డిమాండ్‌ పెట్టాం. 

కానీ అందులో సగానికి తగ్గించి ప్యాకేజీ అంటూ చెప్పడం అన్యాయం. ప్రభుత్వం ఇచ్చే రిటైర్మెంట్‌ ప్యాకేజీ వారి జీవితానికి ఏమాత్రం సరిపోదు. డిమాండ్ల సాధన కోసం మళ్లీ న్యాయపోరాటం చేస్తాం.   – టేకుమల్ల సమ్మయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement