కొడిచర్లతండా ఓటర్ల నిరసన | Sakshi
Sakshi News home page

కొడిచర్లతండా ఓటర్ల నిరసన

Published Tue, May 14 2024 3:10 PM

కొడిచ

కొత్తూరు: తమ సమస్యలను పరిష్కరించాలని లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ వేళ కొత్తూరు మండలం కొడిచర్ల తండా ఓటర్లు ఆందోళన చేపట్టారు. నూతనంగా ఏర్పడిన తమ గ్రామ పంచాయతీలో పోలింగ్‌ కేంద్రం, రేషన్‌ దుకాణాలను ఏర్పాటు చేసే వరకు ఓటు వేయబోమని సోమవారం నిరసనకు పూనుకున్నారు. ఓ వైపు పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతుండడం.. తండా ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో అధికారులు వెంటనే స్పందించారు. మండల ఎన్నికల అధికారులు, తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు ఓటర్లు తమ సమస్యలను వారికి విన్నవించారు. తండా నుంచి పోలింగ్‌ కేంద్రం సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. తండా పంచాయతీగా రూపాంతరం చెందిన తర్వాత కూడా రేషన్‌ దుకాణం ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రతినెలా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడిచర్ల గ్రామానికి వెళ్లి సరుకులు తీసుకోవాల్సి వస్తుందని వాపోయారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా తండాలోనే రేషన్‌ దుకాణం, పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు తండావాసుల సమస్యను ఉన్నతాధికారులకు నివేదించారు. త్వరలోనే రేషనన్‌ దుకాణం ఏర్పాటుకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో తండావాసులు ఆందోళన విరమించారు. అనంతరం వారికి వాహనాలు ఏర్పాటు చేసి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు.

పోలింగ్‌ బూత్‌ ఏర్పాటుకు నిరసన

కందుకూరు: తమ గ్రామంలోనే పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేయాలని గతంలో ఎన్నిసార్లు వినతులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో మండల పరిధిలోని తిమ్మాపూర్‌ అనుబంధ గ్రామం చీమలవానికుంట ఓటర్లు నిరసన చేపట్టారు. ఈ మేరకు ఓటు వేయకుండా సోమవారం గ్రామంలోనే బైఠాయించారు. చీమలవానికుంట గ్రామం తిమ్మాపూర్‌ నుంచి దాదాపుగా మూడు కిలోమీటర్ల మేర దూరంలో ఉంటుంది. దాదాపుగా 350 మంది వరకు ఓటర్లు ఉన్నారు. కాగా పోలింగ్‌ బూత్‌ను గతంలో తమ గ్రామంలోనే ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వినతులు చేసినా ఉపయోగంలేదు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో సైతం చీమలవానికుంట ఓటర్లకు తిమ్మాపూర్‌లోనే పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న పోలింగ్‌ బూత్‌కు 350 మంది వరకు ఓటర్లు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలి. దీంతో వారు సోమవారం ఉదయం 8 గంటల నుంచి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ఓటు వేయమంటూ నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డితో పాటు ఎన్నికల అధికారులు వారి వద్దకు వెళ్లి భవిష్యత్‌ ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌ ఇక్కడే ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిరసన విరమించి సొంత వాహనాల్లో ఓటు వేయడానికి పోలింగ్‌ బూత్‌కు తరలివెళ్లారు.

పోలింగ్‌ కేంద్రం, రేషన్‌ షాపు కోసం రోడ్డుపై బైఠాయింపు

అధికారుల హామీతో సద్దుమణిగిన వ్యవహారం

కొడిచర్లతండా ఓటర్ల నిరసన
1/2

కొడిచర్లతండా ఓటర్ల నిరసన

కొడిచర్లతండా ఓటర్ల నిరసన
2/2

కొడిచర్లతండా ఓటర్ల నిరసన

Advertisement
 
Advertisement
 
Advertisement