మాటమార్చితే.. సహించం | Sakshi
Sakshi News home page

మాటమార్చితే.. సహించం

Published Fri, May 17 2024 5:50 AM

మాటమార్చితే.. సహించం

వనపర్తి: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వరిధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామన్న కాంగ్రెస్‌.. సన్నాలకే ఇస్తామని మాట మార్చితే.. ఊరుకునేది లేదని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్‌ అన్నారు. గురువారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ విషయంపై స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది రైతులు దొడ్డు రకం వరి సాగు చేస్తారని.. కొద్దిపాటి సన్నాలు సాగుచేసే రైతులకే బోనస్‌ ఇచ్చి చేతులు దులుపుకొనేందుకు కాంగ్రెస్‌ పాలకులు కొత్తరాగం ఎత్తుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే రైతులకు రుణ మాఫీ, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేయకుండా రైతులను గోస పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజకొంటామని, వరికి రూ.500, మక్కలకు రూ.330, చెరుకుకు రూ.850, పప్పుధాన్యాలకు రూ.300 నుంచి రూ.500 వరకు, పసుపు, మిర్చికి రూ.800 బోనస్‌ ఇస్తామని, రైతుల ఓట్లు దండుకుని గెద్దెనెక్కిన తర్వాత కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులతో కలిసి నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌, కౌన్సిలర్లు నాగన్న యాదవ్‌, బండారు కృష్ణ, నాయకులు ఆవుల రమేష్‌, మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement