Sakshi News home page

'బర్రెలక్క' తమ్ముడిపై దాడి..! ఓట్లు చీల్చుతుందనే భయంతోనే ఇలా..

Published Thu, Nov 23 2023 1:00 AM

- - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్కకు ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆమె తమ్ముడు భరత్‌పై పెద్దకొత్తపలి మండలం వెన్నచెర్లలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు తాను ఓట్లు చీల్చుతాననే భయంతో దాడులకు తెగబడుతున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరికాదని శిరీష వాపోయింది.

ఆమె తమ్ముడిపై దాడిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా తప్పుబట్టారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిర్వహించాలని, పోటీలో ఉన్న వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ ఈ దాడి అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆమెకు, కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన డీజీపీ, ఎన్నికల ప్రధాన కార్యదర్శిని కోరారు.

సీపీఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు, పలు ప్రజా సంఘాల నాయకులు దాడిని ఖండించారు. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీరం హర్షవర్దన్‌రెడ్డి కూడా దాడి హేయనీయమన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించాలని, మహిళా అభ్యర్థిపై దాడికి ప్రయత్నించడం, ఆమె సోదరునిపై దాడికి పాల్పడడం దారుణమన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదన్నారు. ఈ దాడి ఘటనపై కొల్లాపూర్‌లో సోషల్‌మీడియాలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఇవి చదవండి: 'యుద్ధానికి సిద్ధంగా ఉండాలి' : విజయశాంతి

Advertisement

తప్పక చదవండి

Advertisement