చరిత్రాత్మకం.. దశరథ రామాలయం | Sakshi
Sakshi News home page

చరిత్రాత్మకం.. దశరథ రామాలయం

Published Fri, May 17 2024 7:30 AM

చరిత్

సాక్షి,బళ్లారి: రామాయణ పురాణాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ పట్టణం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని గుడ్డదనేరళకెరె గ్రామంలో వెలిసిన దశరథ రామలింగేశ్వరాలయం అత్యంత ప్రాచీనమైనది. తాలూకాలోని దశరథ రామేశ్వర పుణ్యక్షేత్రానికి ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉంది. ఇది అత్యంత ప్రాచీన, ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఫుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. దశరథ రామేశ్వర క్షేత్రానికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య పుణ్యక్షేత్రానికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని నేటికీ పురాణ కథలు, స్థానిక మహిమ గాధలు చాటి చెబుతున్నాయి. ఈ ఆలయ మహిమను తెలుసుకున్న శ్రీరామ సంస్కృతి పరిశోధన సంస్థానం సంబంధిత బృందం 2017లో ఈ ఆలయాన్ని సందర్శించి చారిత్రాత్మక గుర్తులు, ఆనవాళ్లపై కూడా పరిశోధనలు జరిపింది. దశరథుడు ప్రతిష్టాపించిన శివలింగం ఇక్కడ కొలువుదీరి ఉందని, శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చి వెళ్లారన్న సమాచారాన్ని ధృవీకరించుకున్న సదరు బృందం అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరామ మందిరం శంకుస్థాపనకు దశరథ రామేశ్వరం నుంచి పవిత్ర జలంతో మట్టిని సేకరించి తీసుకెళ్లి రామమందిర కట్టడానికి కూడా వినియోగించారు.

దశరథుని వేటతో వెలుగులోకి

త్రేతాయుగంలో అయోధ్యను పాలించిన దశరథ మహారాజు తన సేనతో గొండా ఆరణ్యంలో వేట కోసం సంచరిస్తూ, ఇక్కడ వజ్రగిరికి వచ్చి చేరుకున్నారు. వజ్రగిరి అప్పట్లో చాలా పెద్ద క్రూరమృగాల స్థావరంగా ఉండేది. దశరథ మహారాజు ఒకరోజు వేటాడుతూ వజ్రగిరి సరోవరం వద్దకు వచ్చినప్పుడు క్రూరమృగాలను వేటాడేందుకు కాపు కాచాడు. అయితే అదే సమయానికి సుదూర ప్రాంతం నుంచి పుట్టుకతోనే గుడ్డివారైన తన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని వారిని భుజాల మీద మోసుకుని సంచరిస్తూ వచ్చిన శ్రవణకుమారుడనే రాజకుమారుడు తనకు, తల్లిదండ్రులకు నీటిదప్పిక కావడంతో ఆ సరోవర ప్రాంతంలోనే తమ తల్లిదండ్రులను దింపి, పొరుగున ఉన్న సరోవరంలోని నీటిని తాగి, తల్లిదండ్రులకు నీటిని తేవడానికి నీటిని నింపుకుంటుండగా గలగలా శబ్ధం వచ్చింది. ఈ శబ్ధం విన్న దశరథుడికి ఏదో పెద్ద క్రూరమృగం వచ్చి నీళ్లు తాగుతోందని భ్రమిస్తాడు. దీంతో తక్షణమే అప్రమత్తుడై విల్లును తీసుకుని శబ్ధవేధి విద్యజ్ఞానంతో శబ్ధం వచ్చిన దిక్కుకు గురిపెట్టి బాణాన్ని సంధించాడు. దశరథుడు వదిలిన ఆ బాణం శ్రవణకుమారుడికి తగలడంతో గట్టిగా ఆర్తనాదం చేస్తూ కుప్పకూలిపోతాడు.

శ్రవణుడి మరణంతో శాపం

కుమారుడి ఆర్తనాదం విన్న వృద్ధ తల్లిదండ్రులు తమ కుమారుడికి ఏదో ప్రాణాపాయం సంభవించిందని ఆందోళనకు గురవుతున్న వేళ అక్కడికి వచ్చిన దశరథుడు తన వల్ల కలిగిన ఘోర తప్పిదం వల్ల శ్రవణకుమారుడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పి ఆవేదన చెందాడు. చేసిన తప్పు, పొరపాటుకు ఎంతో బాధపడుతూ దశరథుడు సరోవరం వద్ద నుంచి తాగునీటిని తీసుకుని శ్రవణకుమారుడి తల్లిదండ్రుల వద్దకు వచ్చి నీటిని అందించి జరిగిన విషయాన్ని వివరించి తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నించాలని కోరాడు. అయితే కుమారుడు హతుడయ్యాడని తెలుసుకున్న ఆ అంధ తల్లిదండ్రులు ఆగ్రహంతో కన్నీరుమున్నీరుగా విలపించి దశరథుడిని శపిస్తారు. కుమారుడి వియోగం, బాధ తట్టుకోలేక వారిద్దరూ కూడా అక్కడే ప్రాణాలు వదులుతారు. దశరథుడు శాప విమోచనం కోసం సమీపంలోని గుహలో ఓ శివలింగాన్ని ప్రతిష్టాపించి ఆరాధిస్తాడు. దశరథుడు ప్రతిష్టాపించిన శివలింగాన్ని ఆ తర్వాత శ్రీరాముడు కూడా అటుగా వచ్చినప్పుడు పూజిస్తాడు.

అందుకే ఆ పేరు వచ్చింది

దశరథుడు, శ్రీరాముడు ఇద్దరూ కలిసి పూజించడం వల్లనే ఈ ఆలయానికి దశరథ రామలింగేశ్వర అని పేరు వచ్చింది. దీనికి ప్రతీకగా నిలిచేలా క్షేత్ర శాసనంలో నేటికీ గుహ ముందున్న పర్వతాన్ని శ్రవణకుమార పర్వతమని భక్తులు పిలుచుకుంటారు. గుహలో ప్రతిష్టాపించిన శివలింగం కొలువై ఉండగా, గుహను అనుకుని ఇక్కడ నిత్యం నీరు ప్రవహిస్తుంటుంది. శ్రవణకుమారుడి సమాధితో పాటు అతడి తల్లిదండ్రుల సమాధులు ఇక్కడ నెలకొన్నాయి. శ్రవణకుమారుడు తల్లిదండ్రులను మోసే కావడితో కూడిన విగ్రహాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దశరథ రామేశ్వర ఆలయాన్ని దర్శించుకుని పునీతులవుతున్నారు. దశరథుడు, శ్రీరాముడు ఇద్దరూ కలిసి పూజలు చేసినందున ఆ లింగానికి శ్రీదశరథ రామలింగేశ్వర అనే పేరు వచ్చిందని చరిత్ర ఆధారాలు, పురాణ కథలు వెల్లడిస్తున్నాయి.

దశరథుడు ప్రతిష్టాపించిన అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రం

అయోధ్యతో ఈ ఆలయానికి

అవినాభావ సంబంధం

చరిత్రాత్మకం.. దశరథ రామాలయం
1/2

చరిత్రాత్మకం.. దశరథ రామాలయం

చరిత్రాత్మకం.. దశరథ రామాలయం
2/2

చరిత్రాత్మకం.. దశరథ రామాలయం

Advertisement
 
Advertisement
 
Advertisement