ఉపాధి కోసం వచ్చి తిరిగిరాని లోకాలకు.. | Sakshi
Sakshi News home page

ఉపాధి కోసం వచ్చి తిరిగిరాని లోకాలకు..

Published Fri, May 17 2024 7:05 AM

-

● ద్విచక్రవాహనంతో తాటిచెట్టును ఢీకొని బావ మృతి ● గాయాలపాలైన బావమరిది

సారంగపూర్‌: ఉపాధి కోసం అత్తగారి గ్రామానికి వచ్చి జీవనోపాధి పొందుతున్న ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన మండలంలోని కౌట్ల(బీ) గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. కుభీర్‌ మండలం హాల్ద గ్రామానికి చెందిన శంకర్‌ (35)కు మండలంలోని కౌట్ల(బీ) గ్రామానికి చెందిన గజ్జవ్వతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు, కుమారుడున్నారు. స్వగ్రామంలో ఉపాధి కరువై శంకర్‌ తన అత్తగారి గ్రామమైన కౌట్ల(బీ)కి కుటుంబంతో ఐదేళ్ల క్రితం వచ్చాడు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం కూలీ పనులు ముగించుకుని పని నిమిత్తం సారంగపూర్‌కు తన బావమరిది కుంటాల నరేశ్‌ (24)తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తిరిగి వస్తుండగా కరుణాకర్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌ సమీపంలో తాటిచెట్టుకు ద్విచక్రవాహనంతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శంకర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. నరేశ్‌కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు 108లో నిర్మల్‌ ఏరియాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కాగా, శంకర్‌ మృతితో అతడి కుటుంబం వీధినపడింది. నరేశ్‌ది పేద కుటుంబం కావడంతో మెరుగైన వైద్యం చేయించే స్తోమత వారికి లేదు. శంకర్‌ మృతదేహాన్ని అతడి స్వగ్రామం కుభీర్‌ మండలం హాల్దాకు తరలించారు. శంకర్‌ మృతితో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement