No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, May 17 2024 8:00 AM

No Headline

మార్కాపురం: ప్రకాశం, గుంటూరు, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాల్లో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. జిల్లాలో మార్కాపురం పరిధిలో 900 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉంది. దాదాపు 84 పెద్ద పులులతో పాటు 400కుపైగా చిరుతలు, జింకలు, దుప్పులు, నెమళ్లు తదితర వన్యప్రాణులకు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పరిధిలో మార్కాపురం, యర్రగొండపాలెం, గంజివారిపల్లె, గుంటూరు జిల్లాలోని విజయపురిసౌత్‌ రేంజ్‌లు ఉండగా, గిద్దలూరు పరిధిలో గిద్దలూరు, గుండ్లకమ్మ, తురిమెళ్ల, కనిగిరి, ఒంగోలు ఉన్నాయి. మూడు వారాలుగా నల్లమల పరిసర ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనుషులే ఎండవేడికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నోరులేని వణ్యప్రాణుల పరిస్థితి ఊహించలేము. అటవీ ప్రాంతంలో నీటి లభ్యత కూడా కరువైంది. దీంతో తాగునీటి కోసం దోర్నాల–శ్రీశైలం, దోర్నాల–ఆత్మకూరు రహదారిపైకి, గ్రామాల వైపు వణ్యప్రాణులు వెళ్తున్నాయి. తిరిగి అవి అరణ్యంలోకి వెళ్లలేకపోతున్నాయి. వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. ఇవి అటవీ ప్రాంతాన్ని వదిలిరాకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నారు. నీటి వనరుల కోసం ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో 175 సాసర్‌పిట్లు ఏర్పాటు చేసి ప్రతి రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటితో నింపుతున్నారు. వీటితో పాటు సహజసిద్ధంగా 275 నుంచి 300 నీటి కుంటలు ఉన్నాయి. వీటికి అదనంగా 40 నీటి కుంటలు ఏర్పాటు చేశారు. 20 సోలార్‌ పంప్‌సెట్ల ద్వారా నీటితో నింపుతున్నారు. దీంతో పెద్ద పులులు, చిరుతలు, దుప్పులు ఇతర వన్యప్రాణులు అక్కడికి వచ్చి నీళ్లు తాగుతున్నాయి. దీని వలన రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు గురికాకుండా ఉన్నాయి. సీసీ కెమెరాల ద్వారా వీటి కదలికలను పరిశీలిస్తున్నారు.

బేస్‌ క్యాంపులు ఏర్పాటు...

నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు తెలుసుకునేందుకు బేస్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పెద్దపులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటి కదలికల కోసం సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. గంజివారిపల్లె సమీపంలోని పెద్దన్న బేస్‌ క్యాంప్‌, ఇష్టకామేశ్వరీ, దొరబైలు, నారుతడికల, పాలుట్ల, కొలుకుల, తుమ్మలబైలు, వెదురుపడియ, కొర్రపోలు, చినమంతనాల, రోళ్లపెంట తదితర ప్రాంతాల్లో బేస్‌ క్యాంప్‌లు ఉన్నాయి. ఇందులో ఐదుగురు అటవీ అధికారులు ఉంటారు. అడవిలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు కొర్రపోలు, శిరిగిరిపాడు, దోర్నాల గణపతి గుడి వద్ద ఫారెస్ట్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద 120 మంది ప్రొటెక్షన్‌ వాచర్లు పులుల సంరక్షణలో ఉన్నారు. రాత్రి సమయంలో అడవి జంతువులు వచ్చి దాహం తీర్చుకుంటాయి. నల్లమల అటవీ ప్రాంతంలో సహజ కుంటల్లో వేసవిలో కూడా ఇక్కడ నీరు ఉండటం విశేషం. దీంతో అడవి జంతువులు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement