భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేస్తాం
సరిహద్దు భద్రతపై ప్రభుత్వం ప్రధాన దృష్టి
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విశాఖకు..
సాక్షి, విశాఖపట్నం: సముద్ర జలాల్లో శాంతి స్థాపనే తమ లక్ష్యమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సురక్షిత నౌకాయానం, రూల్–బేస్డ్ వరల్డ్ ఆర్డర్, యాంటీ పైరసీ, హిందూ మహా సముద్ర ప్రాంత(ఐవోఆర్) పరిధిలో శాంతి– స్థిరత్వం ప్రధాన ప్రాధాన్యతలుగా తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండో సారి రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్‌నాథ్‌సింగ్ తొలి పర్యటన విశాఖలో శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర భద్రతను మరింత పటిష్టం చేస్తామన్నారు. ఇండియన్ నేవీ ఉనికిని మరింత ప్రభావవంతంగా చేయడంపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్‌కు చెందిన స్నేహపూర్వక దేశాలు సురక్షితంగా ఉంటూ పరస్పర ప్రగతి పథంలో కలిసి ముందుకు సాగేలా ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.
దేశ అభివృద్ధిలో నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోందనీ.. అంతర్జాతీయ వేదికగా భారత నౌకాదళ ఖ్యాతి పెరుగుతోందని ప్రశంసించారు. ఆర్థిక, సైనిక శక్తి ఆధారంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఏ దేశం ప్రమాదంలో పడకుండా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కలిగిన భారత నౌకాదళం భరోసానిస్తోందన్నారు.
పాక్ పౌరుల్ని రక్షించి మానవత్వాన్ని ప్రపంచానికి చాటింది
ఈ ఏడాది మార్చిలో అరేబియా సముద్రంలో 23 మంది పాకిస్తానీ పౌరులను సోమాలి సముద్రపు దొంగల బారి నుంచి విడిపించినప్పుడు నేవీ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ తీరు ప్రశంసనీయమన్నారు. జాతీయత, శత్రుత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసేలా ఇండియన్ నేవీ సిబ్బంది వ్యవహరిస్తూ.. మానవత్వ విలువల్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని కొనియాడారు.
భారతదేశ వాణిజ్య ప్రయోజనాలు ఐవోఆర్‌తో ముడిపడి ఉన్నాయనీ, వి్రస్తృత జాతీయ లక్ష్యాలను సాధించేందుకు నౌకాదళం సముద్ర సరిహద్దులను సంరక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తోందన్నారు. పెరుగుతున్న పారిశ్రామిక మౌలిక సదుపాయాల ద్వారా భారత నౌకాదళం నిరంతరం బలపడుతోందన్నారు. షిప్‌యార్డ్‌లు విస్తరిస్తున్నాయనీ, విమాన వాహక నౌకలు బలోపేతమవుతున్నాయన్నారు. ఇండియన్ నేవీ కొత్త శక్తివంతమైన శక్తిగా అభివృద్ధి చెందుతోందన్నారు.
ఘన స్వాగతం
తొలుత విశాఖలోని నేవల్ ఎయిర్ బేస్ ఐఎన్‌ఎస్ డేగాకు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కలిసి చేరుకున్న రక్షణ మంత్రికి ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఘన స్వాగతం పలికారు. 50 మందితో కూడిన గార్డ్ ఆఫ్ హానర్‌తో సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రానికి చేరుకున్న ఆయన ఐఎన్‌ఎస్ జలాశ్వలో పర్యటించారు.
ఈ సందర్భంగా వివిధ నౌకలు, జలాంతర్గాములు, నేవల్ కమాండ్ విమానాల ద్వారా డైనమిక్ కార్యకలాపాలను వీక్షించారు, తూర్పు సముద్ర తీరంలో భారత నౌకాదళం కార్యాచరణ సంసిద్ధతని రాజ్‌నాథ్‌సింగ్ సమీక్షించారు. ‘డే ఎట్ సీ’ ముగింపులో భాగంగా స¯Œరైజ్ ఫ్లీట్ సిబ్బందితో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భోజనం చేశారు. గౌరవ వీడ్కోలు అనంతరం.. ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకొని ఢిల్లీకి పయనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment