సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి అసెంబ్లీ స్పీకర్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీలో సీనియర్ నాయకుడు అవడంతోపాటు గతంలో పలుసార్లు మంత్రిగా పని చేసిన అయ్యన్నకు మంత్రివర్గంలో కచ్చితంగా చోటు దక్కుతుందని అంతా భావించారు. అయితే సీఎం చంద్రబాబు ఆయనకు పదవి ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం ఆయన చంద్రబాబును కలిశారు. ఈ సమయంలో స్పీకర్ పదవి ఇస్తానని చంద్రబాబు ఆయనకు చెప్పినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
టీడీపీ నేతలకు గవర్నర్ పదవులు?
ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉండడంతో ఒకటి, రెండు గవర్నర్ పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం. టీడీపీలో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లను గవర్నర్ పదవుల కోసం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
యనమల రామకృష్ణుడు శుక్రవారం చంద్రబాబును కలవగా ఈ విషయం చెప్పి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి పదవి ఆశించిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను శాసన సభలో చీఫ్ విప్ పదవికి పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
నీటి పారుదల శాఖపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్ష చేశారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన సమీక్షలో పోలవరం సహా వివిధ ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో చర్చించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని, ఆ తర్వాత మంత్రివర్గ , అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఆరుద్ర కుమార్తె వైద్యానికి రూ.5 లక్షలు!
శుక్రవారం సచివాలయంలో కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ తన కుమార్తెతో కలిసి సీఎం చంద్రబాబును కలిసి న్యాయం చేయాలని కోరింది. స్పందించిన చంద్రబాబు ఆమె కుమార్తె ఆరోగ్య ఖర్చుల కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం, ప్రతి నెలా రూ.10 వేల పింఛను ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment