పోల్‌.. కూల్‌ | Sakshi
Sakshi News home page

పోల్‌.. కూల్‌

Published Tue, May 14 2024 3:15 PM

పోల్‌.. కూల్‌

జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతం

వికారాబాద్‌: చెదురుమదురు సంఘటనలుమినహా జిల్లాలో సోమవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగినట్లు అధికారులు ప్రకటించారు. ధారూరు మండలం అల్లీపూర్‌లో మధ్యాహ్నం ఈవీఎం మొరాయించగా సరి చేశారు. గంట తర్వాత పోలింగ్‌ మళ్లీ ప్రారంభమయ్యింది. సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌తో సహా జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వారివారి ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా అల్లర్లు జరగకుండా పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎన్నికలు ముగిసే సమయానికి 68 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ బూత్‌ ఆవరణలో ఉన్నవారందరూ ఓటు వేసేలా చేస్తామని అధికారులు తెలిపారు.కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి పోలింగ్‌ కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

ఓటు వేసిన ప్రముఖులు

జిల్లాలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కు టుంబ సభ్యులతో కలిసి కొడంగల్‌లో ఓటు వేశా రు. మర్పల్లి మండల కేంద్రంలో అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఓటేశారు. తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, వికారాబాద్‌లో కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. యాలాల మండలం దౌలాపూర్‌లో జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి ఓటు వేశారు. దోమ మండలం శివారెడ్డిపల్లిలో పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఓటు వేశారు. మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్‌(వికారాబాద్‌లో), మహేశ్‌రెడ్డి(పరిగిలో) కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.

భారీ బందోబస్తు ఏర్పాటు

జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 9,83,740 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 4,85,748, మహిళలు 4,97,957, ట్రాన్స్‌ జెండర్లు 35 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,148 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్‌ నిర్వహించారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సరళిని వీడియో రికార్డింగ్‌ చేశారు.

పోలింగ్‌ సరళి పరిశీలన

అనంతగిరి: జిల్లాలో ఓటింగ్‌ సరళిని వ్యయ పరిశీలకులు రాజీవ్‌ చావ్రా పరిశీలించారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌ కాస్టింగ్‌లో ఓటింగ్‌ను పరిశీలించారు.

68 శాతం పోలింగ్‌

ధారూరు మండలం అల్లీపూర్‌లో మొరాయించిన ఈవీఎం

గంట తర్వాత మళ్లీ ప్రారంభం

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

కొడంగల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన సీఎం రేవంత్‌రెడ్డి

కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

జిల్లాలో 68 శాతం పోలింగ్‌ నమో దైంది. పరిగిలో 66 శాతం, వికారాబాద్‌లో 70 శాతం, తాండూరులో 67.30శాతం, కొడంగల్‌లో 70శాతం పోలింగ్‌ నమోదైంది.వేసవి కావడంతో ఉదయమే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు. మధ్నాహ్నం అవుతున్న కొద్దీ కాస్త నెమ్మదించింది. సోమవారం ఎండ కాస్త తక్కువగానే ఉండటంతో జనాలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 7నుంచి 9గంటల వరకు 11శాతం, 11గంటల వరకు 26 శాతం, ఒంటి గంటవరకు 45 శాతం, 3గంటల వరకు 56శాతం, సాయంత్రం 5గంటల వరకు 64.44 శాతం ఓటింగ్‌ నమోదవ్వగా పోలింగ్‌ ముగిసే సమయానికి 68శాతం నమోదైంది.

Advertisement
 
Advertisement
 
Advertisement