టోనీ వ్యవహారంలో మనీల్యాండరింగ్‌ | Sakshi
Sakshi News home page

టోనీ వ్యవహారంలో మనీల్యాండరింగ్‌

Published Sat, Feb 5 2022 4:27 AM

Panjagutta Police Investigation Nigerian Drug Lords Tony Money Laundering - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్, బెంగళూరు, ముంబై కేంద్రంగా ఏళ్లుగా డ్రగ్స్‌ దందా సాగించిన నైజీరియన్‌ టోనీ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు పంజగుట్ట పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఆధారాలు సేకరించాక ఈడీ అధికారులకు సమాచారం ఇవ్వనున్నారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఈడీ అధికారులకు ఉంది.

అయితే పీఎంఎల్‌ఏ కింద నమోదయ్యే కేసులు రూ. వందలు, రూ.వేల కోట్లలో ఉంటాయి. టోనీ దందా రూ.10 కోట్ల లోపే ఉంటుందని భావిస్తుండటంతో ఎలా స్పందిస్తారో చెప్పలేమని ఓ పోలీసు అధికారి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై జంగ్‌ నడుస్తుండటంతో కేసు ప్రాధాన్యతను వివరిస్తూ ఈడీకి లేఖ రాస్తామని చెప్పారు. 

విగ్గుల వ్యాపారం ముసుగులో..
కస్టమర్లతో సోషల్‌ మీడియా ద్వారా సంప్రదింపులు జరిపిన టోనీ ఆర్థిక లావాదేవీలకు అనుచరులైన ఆరిఫ్‌ తదితరుల ఖాతాలు వాడుకున్నాడు. వీటిలోకి వచ్చిన డబ్బులో ఖర్చులు, ఏజెంట్ల కమీషన్లు పోగా మిగతాది విగ్గులు, వస్త్రాల వ్యాపారం ముసుగులో నైజీరియాలోని తన స్వస్థలానికి తరలించాడు. ఇందుకు ముంబైలోని అంధేరీలో వెస్ట్రన్‌ యూనియన్‌ సంస్థ ద్వారా ఈ లావాదేవీలు చేశాడు. డ్రగ్‌ దందాకు సంబంధించిన ఇవన్నీ మనీ లాండరింగ్‌ కిందికే వస్తాయని పంజగుట్ట పోలీసులు చెప్తున్నారు.

టోనీతో పాటు ఆరిఫ్, ఆసిఫ్, ఆఫ్తాబ్‌ల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలకు సంబంధించి ఆధారాలు సేకరించాక టోనీ, అతడి అనుచరులతో పాటు వీరి వద్ద డ్రగ్స్‌ కొన్న బడాబాబుల వివరాలు, బ్యాంకు స్టేట్‌మెంట్లను ఈడీకి అప్పగించాలని నిర్ణయించారు. మరోపక్క 2019లో గోల్కొండ, నాంపల్లి ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్లలో నమోదైన కేసుల్లో ఎస్కే చుక్స్‌ పేరుతో టోనీ వాంటెడ్‌గా ఉన్నాడు. దీని ఆధారంగా టోనీని పీటీ వారెంట్‌పై తమ కేసుల్లో అరెస్టు చేయడానికి ఎక్సైజ్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆపై రెండు కేసుల్లోనూ వేర్వేరుగా కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.    

ముగ్గురి రిమాండ్‌
పంజగుట్ట: డ్రగ్స్‌ కేసులో మహారాష్ట్రలో అరెస్టు చేసిన ముగ్గురు డ్రగ్స్‌ సప్‌లైయర్స్‌ను పంజగుట్ట పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. కేసులో 5వ నిందితుడుగా ఉన్న మహారాష్ట్రలో డెలివరీ బాయ్‌గా పని చేసే ఎమ్‌.డీ ఆసిఫ్‌ ఆరిఫ్‌ షేక్‌ (22), ముంబైలో మొబైల్‌ సర్వీసింగ్‌ చేసే ఆరిఫ్‌ అహ్మద్‌ ఖాన్‌ (21) (7వ నిందితుడు), మహారాష్ట్రలో మొబైల్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ నడిపిస్తున్న మహ్మద్‌ ఇర్ఫాన్‌ ఆరిఫ్‌ షేక్‌ (27) (9వ నిందితుడు)లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని శుక్రవారం నాంపల్లిలోని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement