అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అందుకు తగ్గట్లే మార్పులు చేపట్టారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం తాలుకా గుర్తులనూ చెరిపేసే అడుగులు వేశారు. ఇందులో ఒకటే.. ఫించన్ల పథకం పేరు మార్పు.
2014 -2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పేరుతో ఫించన్లు అందించేది. కాకపోతే.. లబ్ధిదారులు స్వయంగా వెళ్లి క్యూ లైన్లలో నిలబడి ఆ డబ్బును అందుకోవాల్సి వచ్చేది. అయితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ పరిస్థితి మారింది. ఫలితంగా.. గత ఐదేళ్లుగా వైఎస్సార్ పెన్షన్ కానుక పేరిట వలంటీర్ వ్యవస్థ ద్వారా..అదీ ఒకటో తేదీనే.. ఇంటికే పెన్షన్లు చేరేవి.
అయితే ఎన్నికల హామీలో భాగంగా సామాజిక భద్రత పెన్షన్ల పెంపును ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ పథకం పేరు మార్చేశారు. ఏపీలో ఫించన్ పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధిరించారు. ఈ మేరకు జీవో కూడా విడుదలైంది.
రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్ దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసింది.
రాష్ట్రంలో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ ఐవీ బాధితులు, కళాకారులకు ప్రతీనెల రూ.3వేలు పింఛన్ అందుతుంది. సీఎంగా చంద్రబాబు ఆ పింఛన్ ను రూ.4వేలకు పెంచుతూ దస్త్రంపై గురువారం సంతకం చేశారు. దీంతో ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనుండటంతో జులై 1న పింఛన్ కింద వీరికి రూ. 7వేలు (జులై1న ఇచ్చే రూ.4వేలు, ఏప్రిల్ నుంచి మూడు నెలలకు రూ వెయ్యి చొప్పున) అందివ్వనున్నారు. అలాగే.. దివ్యాంగులకు ప్రస్తుతం రూ.3వేలు అందుతుంది.. జులై నెల నుంచి వారికి రూ. 6వేలు అందివ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment