సీఐడీకి హైకోర్టు ఆదేశం.. విచారణ ఈనెల 18కి వాయిదా
అప్పటివరకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని వినతి
సానుకూలంగా స్పందించని హైకోర్టు
మధ్యంతర బెయిల్‌ను సీఐడీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది
అందువల్ల ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు సాధ్యంకాదు
న్యాయస్థానం స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్)కు చెందిన ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర డాక్యుమెంట్లను తరలించారంటూ ఆ సంస్థ మాజీ ఎండీ డి. వాసుదేవరెడ్డిపై నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
అప్పటివరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలన్న వాసుదేవరెడ్డి అభ్యర్థనపట్ల హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. మధ్యంతర ముందస్తు బెయిల్‌ను సీఐడీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. అందువల్ల ఇప్పటికిప్పుడు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంటూ విచారణను 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
మధ్యంతర ముందస్తు
బెయిల్ కోసం పిటిషన్..
ఏపీఎస్‌బీసీఎల్ కార్యాలయం నుంచి ఆ సంస్థకు చెందిన ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలను వాసుదేవరెడ్డి తీసుకెళ్లారని, ఇవన్నీ ఆయన తన కారులో తరలిస్తుండగా చూశానంటూ కంచికచర్లకు చెందిన గద్దె శివకృష్ణ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సీఐడీ అధికారులు ఈనెల 6న వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు పెట్టారు. అనంతరం హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాసుదేవరెడ్డి సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతాం..
ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్ విచారణ జరిపారు. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. ఈ కేసులో తాను సీఐడీ తరఫున హాజరవుతున్నానని తెలిపారు. ఈ కేసు మొదటిసారి విచారణకు వస్తోందని, అందువల్ల వివరాల సమర్పణకు గడువునివ్వాలని కోర్టును కోరారు. ఈ సమయంలో వాసుదేవరెడ్డి తరఫు న్యాయవాది ఎస్. నగే‹Ùరెడ్డి వాదనలు వినిపిస్తూ.. తాము మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం అనుబంధ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.
చంద్రబాబుపై ఫిర్యాదు చేసినందుకే కేసు..
నిజానికి.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పిటిషనర్‌పై కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబుపై పిటిషనర్ వాసుదేవరెడ్డి గతంలో ఫిర్యాదు చేశారని, ఈ కక్షతోనే అతనిపై ఇప్పుడు ఈ కేసు నమోదు చేశారని తెలిపారు. కార్యాలయం నుంచి ఫైళ్లు తీసుకెళ్తున్నట్లు ఫిర్యాదు అందగా, రాత్రి 11.30కి సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. ఆ మరుసటి రోజు 200 మంది పోలీసులు వాసుదేవరెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేశారని.. పోలీసులకు ఏమీ దొరకలేదని, ఆయన పిల్లల ల్యాప్‌టాప్‌లను జప్తు చేశారని వివరించారు. పిటిషనర్‌పై ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే కేసులే ఉన్నాయని, అందువల్ల ఆయన విషయంలో సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏను అనుసరించి నడుచుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. పోసాని జోక్యం చేసుకుంటూ, పిటిషనర్‌పై మరిన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టామన్నారు. ఐపీసీ సెక్షన్లు 409, 467, 471 కింద కూడా కేసు నమోదు చేశామని, ఇవన్నీ ఏడేళ్లు అంతకు మించి శిక్షపడే కేసులేనన్నారు. అందువల్ల 41ఏ ప్రకారం నడుచుకోవడం సాధ్యంకాదన్నారు.
ఫిర్యాదులో గుర్తుతెలియని వ్యక్తి అని ఉంది..
నగేష్ రెడ్డి స్పందిస్తూ.. ఫిర్యాదులో ఎక్కడా వాసుదేవరెడ్డి కారు నెంబర్ లేదని, ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారన్నారు. ఫిర్యాదులో గుర్తు తెలియని వ్యక్తులు అని ఉంటే, ఎఫ్‌ఐఆర్‌లో పిటిషనర్ పేరును చేర్చారన్నారు. ఇది పూర్తిగా తప్పుడు కేసన్నారు. సోదాలు జరిగిన రోజు పిటిషనర్ ఢిల్లీలో ఉన్నారన్నారు. పోసాని స్పందిస్తూ.. వాసుదేవరెడ్డి మామ, బావమరిది ఇళ్లలో సోదాలు నిర్వహించామని, వాసుదేవరెడ్డి కారులో కీలక పత్రాలు స్వా«దీనం చేసుకుని సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశామన్నారు. సోదా చేసిన కారులో రూ.4 కోట్ల విలువచేసే 6 కేజీల బంగారం కొనుగోలు తాలుకు బిల్లులు, వాసుదేవరెడ్డి ఐడీ కార్డు దొరికాయన్నారు. ఈ వివరాలను మేజి్రస్టేట్ ముందుంచామన్నారు.
సాక్ష్యాలను తారుమారు చేస్తారు..
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పూర్తి వివరాల సమర్పణ నిమిత్తం ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణను 18కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నగేష్ రెడ్డి జోక్యం చేసుకుంటూ, అప్పటివరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అభ్యరి్థంచారు. లేకుంటే ఈలోపు పిటిషనర్‌ను అరెస్టుచేసే అవకాశం ఉందన్నారు. ఎలాంటి షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటామన్నారు. కావాలంటే పాస్‌పోర్ట్ స్వా«దీనం చేస్తామన్నారు. అయితే, మధ్యంతర ముందస్తు బెయిల్ అభ్యర్థనను పోసాని తీవ్రంగా వ్యతిరేకించారు. వాసుదేవరెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని, బేవరేజస్ కార్పొరేషన్‌లో అతని సహచరులు ఇంకా ఉన్నారని, వారి ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. దీంతో.. మధ్యంతర ముందస్తు బెయిల్‌ను సీఐడీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయడం సాధ్యంకాదని న్యాయమూర్తి స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment