ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
సాక్షి, అమరావతి: పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఆ మధ్యంతర ముందస్తు బెయిల్‌ను ఈ నెల 20 తేదీ వరకు పొడిగిస్తూ.. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈవీఎం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులు సహా మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు పోలీసులు నమోదు చేసిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
తరువాత ఈ వ్యాజ్యాలు గత వారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ వ్యాజ్యాల్లో వాదనలు రాత్రి 10.30 గంటల వరకు సాగడంతో అదే రోజు ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయస్థానానికి సమయం దొరకలేదు. దీంతో న్యాయస్థానం గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం పిన్నెల్లి వ్యాజ్యాలు విచారణకు రాగా న్యాయమూర్తి జస్టిస్ విజయ్ స్పందిస్తూ.. పూర్తిస్థాయిలో వాదనలు విన్నప్పటికీ, నిర్ణయం వెలువరించేందుకు కొంత సమయం పడుతుందన్నారు.
ఈలోగా కోర్టుకు వేసవి సెలవులు ముగుస్తాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలను రెగ్యులర్ బెంచ్ ముందు వచ్చేలా విచారణను వాయిదా వేస్తానని ప్రతిపాదించారు. ఈ విషయంపై ఇరుపక్షాల తరఫు న్యాయవాదుల అభిప్రాయాన్ని కోరారు. ఇందుకు ఇరుపక్షాల న్యాయవాదులు అంగీకరించడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment