వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి అవుట్‌.. శ్రీలంకకు ఏమైంది? | Sri Lanka Knocked Out Of T20 WC 2024 Bangladesh Close In On Super 8 Berth, See Details Inside | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి అవుట్‌.. శ్రీలంకకు ఏమైంది?

Published Fri, Jun 14 2024 8:44 AM | Last Updated on Fri, Jun 14 2024 9:01 AM

Sri Lanka Knocked Out Of T20 WC 2024 Bangladesh Close In On Super 8 Berth

టీ20 ప్రపంచకప్‌-2024లో శ్రీలంక ప్రయాణం ముగిసింది. బంగ్లాదేశ్‌- నెదర్లాండ్స్‌ మధ్య గురువారం నాటి మ్యాచ్‌ ఫలితంతో అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్‌ దశలోనే ఇంటిబాట పట్టిన వనిందు హసరంగ బృందం ఐసీసీ ఈవెంట్‌లో మరో ఘోర పరాభవం మూటగట్టుకుంది.

టీ20 వరల్డ్‌కప్‌ తొమ్మిది ఎడిషన్‌లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌లతో కలిసి శ్రీలంక గ్రూప్‌-డిలో ఉంది. గ్రూప్‌ దశలో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. మూడింట ఒక్కటి కూడా గెలవలేదు.

ఇందులో ఒకటి వర్షార్పణం కావడంతో లంక ఖాతాలో ఒక పాయింట్‌ మాత్రం జమ అయింది. కానీ నెట్‌ రన్‌రేటు(-0.777) పరంగానూ వెనుకబడిపోయింది. ఈ క్రమంలో గ్రూప్‌ దశలో ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉన్నా.. సూపర్‌-8 అవకాశాలను సజీవం చేసుకోవాలంటే ఇతర జట్ల ఫలితాలపై శ్రీలంక పడింది.

అయితే, లంక ఆశలను అడియాసలు చేస్తూ బంగ్లాదేశ్‌ సూపర్‌-8కు దాదాపుగా అర్హత సాధించింది. గ్రూప్‌-డి టాపర్‌ సౌతాఫ్రికా(మూడు మూడు గెలిచింది)తో కలిసి తదుపరి దశ బెర్తును ఖాయం చేసుకునే పనిలో పడింది.

నెదర్లాండ్స్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని 24 పరుగుల తేడాతో బంగ్లా గెలుపొందింది. ఈ క్రమంలో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే నజ్ముల్‌ షాంటో బృందం సూపర్‌-8కు చేరువైంది.

 

శ్రీలంకకు ఏమైంది?
ఇదిలా ఉంటే.. శ్రీలంక గతే వన్డే వరల్డ్‌కప్‌-2023లో చెత్త ప్రదర్శనతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఈ ఐసీసీ ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధించలేని లంక జట్టు.. క్వాలిఫయర్స్‌ ఆడింది.

జింబాబ్వేలో జరిగిన ఈ టోర్నీలో టాపర్‌గా నిలిచి భారత్‌లో అడుగుపెట్టింది. వరుస పరాజయాలు మూటగట్టుకున్న శ్రీలంక టీమిండియా చేతిలో ఏకంగా 302 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి విమర్శలు మూటగట్టుకుంది. ఆ తర్వాత మిగతా మ్యాచ్‌లలోనూ ఓడి కనీసం చాంపియన్‌ ట్రోఫీ- 2025కు కూడా అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడిలా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలోనూ చతికిలపడి ఇంటి బాట పట్టింది ఈ మాజీ చాంపియన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement