సూడో జర్నలిస్టులను ఎండగడతా | Sakshi
Sakshi News home page

సూడో జర్నలిస్టులను ఎండగడతా

Published Thu, May 16 2024 12:20 PM

సూడో జర్నలిస్టులను ఎండగడతా

● నేను పాత్రికేయులకు మిత్రుడిని ● పాత్రికేయ వృత్తి చేసిన వాడిని ● ప్రత్యర్థులకు అమ్ముడుపోయి లేనిపోనివి రాస్తే ఊరుకోం ● మావాళ్లు వారి ఇళ్లవద్ద భయభ్రాంతులకు గురిచేస్తున్నారనడం దుర్మార్గం ● ప్రత్యర్థి నాయకులపై కూడా మేం ఎలాంటి ఘర్షణలకు పాల్పడలేదు ● మీడియాతో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి

తిరుపతి మంగళం: జర్నలిస్టు ముసుగు వేసుకుని భూ కబ్జాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సూడో జర్నలిస్టులను ఎండగడుతానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. తనపై కొందరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘జర్నలిస్టు ముసుగులో కొందరు చేస్తున్న అక్రమాలను బయటపెట్టినందుకు మేమేదో ఉత్తమ జర్నలిస్టులపై ఆరోపణలు చేసినట్లుగా కొందరు ఇతర జర్నలిస్టులు వారికి వత్తాసు పలకడం బాధాకరం. దాంతోపాటు కొందరు పాత్రికేయుల ఇళ్ల వద్దకు మేము మావాళ్లు కొందిరిని బైక్‌లపై పంపి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఎస్పీకి ఫిర్యాదుచేసి సానుభూతి పొందాలని చూస్తున్నారు. గత ఐదేళ్లలో మా ప్రత్యర్థి నాయకులపై కూడా ఏనాడు ఎలాంటి ఘర్షణలకూ పాల్పడని నైజం మాది. మా ప్రత్యర్థులకు అమ్ముడుపోయి ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తూ కథనాలు రాయడం దుర్మార్గం. జర్నలిస్టు ముసుగు వేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న వారు సమాజానికి చీడపురుగులాంటి వారు. అలాంటి సూడో జర్నలిస్టులను ఎండగడుతాం. జర్నలిస్టులంటే నాకు ఎంతో గౌరవం. నేను కూడా పాత్రికేయ వృత్తి చేసినటువంటి వాడిని. పాత్రికేయ వృత్తిలో ఎంత గొప్పగా ఉండాలో తెలుసుకున్నటువంటి వ్యక్తిగా జర్నలిస్టు పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న వారి దుర్మార్గాలను ఎండగట్టకపోతే మొత్తం పాత్రికేయులందరికీ ఆ మరక అంటుకుంటుంది. వీరి అవినీతి అక్రమాలు ఎవ్వరో చెబితే చెప్పింది కాదు. వారితో కలసి పనిచేసే వారే స్వయంగా చెప్పినవి. నేను జర్నలిస్టులకు డబ్బులిచ్చి నా గురించి గొప్పగా రాయించుకునే రాజకీయ నాయకుడినికాదు. ఉద్యమ, పోరాటాలతో రాజకీయంలోకి వచ్చిన వ్యక్తిని’’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement