వైఎస్సార్‌ సీపీ విజయం నల్లేరుపై నడకే | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ విజయం నల్లేరుపై నడకే

Published Thu, May 16 2024 11:45 AM

వైఎస్

భీమవరం: సార్వత్రిక ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రంధి శ్రీనివాస్‌ విజయం నల్లేరుపై నడకేనని, ఓటింగ్‌ సరళిని చూస్తుంటే శ్రీనివాస్‌ భారీ మెజార్టీతో విజయం సాఽధించడం ఖాయమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం భీమవరంలోని మాలమహానాడు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పైనే శ్రీనివాస్‌ సునాయాసంగా విజయం సాధించారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నో జిమ్మిక్కులు చేసి అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మకుండా స్వచ్ఛందంగా పోలింగ్‌ బూత్‌లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైఎస్సార్‌ సీపీకి ఓట్లు వేశారన్నారు. నాయకులు పొన్నమండ బాలకృష్ణ, సీహెచ్‌ గోపి, బి.సునీల్‌బాబు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో తాపీ కూలీ మృతి

తణుకు: తణుకు పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన ఈతకోట అన్నవరం (41) తాపీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. పని నిమిత్తం మోటారు సైకిల్‌పై తణుకు వస్తుండగా జాతీయ రహదారిపై పాత బెల్లంమార్కెట్‌ సమీపంలో మోటారు సైకిల్‌ అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అతనిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అన్నవరం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై కె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇరువర్గాలపై కేసుల నమోదు

భీమవరం అర్బన్‌: పాత గొడవల నేపథ్యంలో బుధవారం జరిగిన కొట్లాటపై ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై జి.రాజు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. కరుకువాడ బేతపూడి గ్రామానికి కొల్లి నాగసత్యవతి, భర్త శ్రీనివాస్‌ ఇద్దరు పిల్లలతో భీమవరంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 13 ఎన్నికలకు ఓట్లు వేయడానికి తన సొంత గ్రామానికి వచ్చింది. ఈ నెల 14న నాగసత్యవతికి అన్నయ్య రావుల ఆదినారాయణ, మేనత్తకు బంగారం విషయమై మళ్లీ ఇరువర్గాలు కొట్లాడుకున్నాయి. గాయాలపాలైన ఇరు వర్గాలవారు పరస్పరం ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వైఎస్సార్‌ సీపీ విజయం నల్లేరుపై నడకే
1/1

వైఎస్సార్‌ సీపీ విజయం నల్లేరుపై నడకే

Advertisement
 
Advertisement
 
Advertisement