17 నుంచి కొంతేరులో నాటికల పోటీలు | Sakshi
Sakshi News home page

17 నుంచి కొంతేరులో నాటికల పోటీలు

Published Thu, May 16 2024 11:50 AM

17 నుంచి కొంతేరులో నాటికల పోటీలు

యలమంచిలి : కొంతేరు గ్రామంలోని పులపర్తి వీరాస్వామి యూత్‌ క్లబ్‌ కళామందిరంలో ఈ నెల 17, 18, 19 తేదీలలో 42వ వార్షిక అఖిల భారత స్థాయి నాటిక పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు యూత్‌ క్లబ్‌ అధ్యక్షుడు అంబటి మురళీకృష్ణ చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నాటిక పోటీల ప్రదర్శనలకు ఏడు నాటికలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తొలి ప్రదర్శనగా కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్‌ వారిచే కౌసల్యా సుప్రజా రామా, మలి ప్రదర్శనగా చిలకలూరిపేట సుకృతి క్రియేషన్స్‌ వారిచే ‘మిణుగురు వెలుగులు’ ప్రదర్శిస్తామన్నారు. రెండో రోజు నెల్లూరి శ్రీక్రాంతి ఆర్ట్స్‌ థియేటర్స్‌ వారిచే ‘ఓ మనిషి కావాలి’, రెండవ ప్రదర్శనగా అనకాపల్లి శ్రీ షిర్డీ సాయి కల్చరల్‌ క్రియేషన్స్‌ వారిచే ‘మలి సంధ్య’, మూడవ ప్రదర్శనగా శ్రీకాకుళం శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య వారిచే ‘ఆసరసాల’ నాటికలు ప్రదర్శిస్తారన్నారు. మూడో రోజు హైదరాబాద్‌ శ్రీయువభేరి థియేటర్‌ ఆర్గనైజేషన్‌ వారిచే ‘బూడిద’, రెండవ నాటికగా గుడివాడ శ్రీ కృష్ణ తెలుగు ధియేటర్‌ ఆర్ట్స్‌ వారిచే ‘మళ్లీ కలిసి జీవిద్దాం’ నాటికలు ప్రదర్శిస్తామని మురళీకృష్ణ వివరించారు. నాటిక ప్రియులంతా పెద్ద సంఖ్యలో హాజరై ప్రదర్శనలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement