పరిహారాన్ని రుణాలకు జమ చేయడం క్రూరం | Sakshi
Sakshi News home page

పరిహారాన్ని రుణాలకు జమ చేయడం క్రూరం

Published Fri, May 17 2024 7:25 AM

పరిహా

మాజీ సీఎం కుమారస్వామి

శివాజీనగర: కేంద్రం విడుదల చేసిన కరువు పరిహార సొమ్మును రైతుల రుణాలకు జమ చేస్తున్నారని, ఇది అత్యంత క్రూరమైన విషయమని మాజీ సీఎం హెచ్‌.డీ.కుమారస్వామి మండిపడ్డారు. అన్నదాత కన్నీరు తుడవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చొన్నదని ధ్వజమెత్తారు. ఈమేరకు సామాజిక మాద్యమాల్లో పోస్ట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పరిహారం రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అయినా ఆ సొమ్మును బ్యాంకులు రుణాలకు జమా చేసుకుంటున్నాయన్నారు. బ్యాంకుల వైఖరి క్రూరమైన విషయమన్నారు. తీవ్ర కరువు, పంటల నాశనంతో నష్టపోయిన రైతుల కళ్లల్లో రక్త కన్నీరు తీసుకొచ్చే అమానవీయ చర్యలని అంటే తప్పు కాదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బ్యాంకు అధికారులతో సమావేశాన్ని నిర్వహించి కరువు పరిహారం రుణాలకు జమ చేయరాదని ఆదేశాలు జారీ చేయాలని కుమారస్వామి డిమాండ్‌ చేశారు.

1నుంచి 4వరకు

మద్యం విక్రయాలు బంద్‌

దొడ్డబళ్లాపురం: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరులో జూన్‌ 1 నుంచి 4వ తేదీ వరకు, 6వ తేదీ మద్యం విక్రయాలు నిషేధిస్తూ బెంగళూరు సిటీ పోలీస్‌ కమిషనర్‌ బి దయానంద్‌ ఆదేశాలు జారీ చేశారు. శాంతిభధ్రతలకు విఘాతం కలగకుండా ఓటింగ్‌కు 48 గంటల ముందు, ఓట్ల లెక్కింపు రోజు మద్యం విక్రయాలు నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

కామాంధుడి అరెస్ట్‌

మైసూరు: చెల్లెలి కూతురిపై అత్యాచారానికి యత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెల్లి కూతురిని ఇంట్లో దిగబెడుతానని చెప్పి కారులో ఎక్కించుకున్న రౌడీషీటర్‌ దైత్యరాజ్‌.. తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో నగర పోలీసు స్టేషన్‌లో దైత్యరాజ్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడిని మైసూరు హారోహళ్లి గ్రామంలో అరెస్టు చేశారు.

కేఈఏ ఎండీపై బదిలీ వేటు

దొడ్డబళ్లాపురం: సీఈటీ ప్రశ్నపత్రాల వ్యవహారంలో కేఈఏ ఎండీ రమ్యపై వేటు పడింది. కేఈఏ పదవి నుంచి ఆమెను తొలగించి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థానంలో టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో డైరెక్టర్‌గా ఉన్న ప్రసన్నను నియమించారు. సీఈటీలో 50కి పైగా సంబంధం లేని ప్రశ్నలను పొందుపరిచారు. ఇందుకు కారణమైన కేఈఏ ఎండీని బదిలీ చేయాలని విద్యార్థుల తల్లితండ్రులు డిమాండు చేశారు. దీంతో ప్రభుత్వం తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకుంది.

నా గెలుపునకు కృషి చేయండి

మండ్య: దక్షిణ ఉపాధ్యాయ నియోజకవర్గం పోటీ చేస్తున్నట్లు, తన గెలుపునకు కన్నడ తదితర అన్ని సంఘాలు, సంస్థల నుంచి మద్దతు కావాలని కన్నడ చళువళి వాటాల్‌ పార్టీ అధ్యక్షుడు వాటాల్‌ నాగరాజ్‌ మనవి చేశారు. నగరంలోని సర్‌ ఎంవీ విగ్రహం ఎదుట వివిధ సంఘాల ముఖ్యులను కలసి మీడియాతో మాట్లాడారు. ఈసారి విధాన పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తానని, మండ్య జిల్లాలో తన అభిమానులు, వివిధ కన్నడ సంఘాలు, కార్యకర్తలు తన తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించాలని కోరారు. కన్నడ పరిరక్షణ కోసం తనపోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించి వాటిని పరిష్కరిస్తానని హామీనిచ్చారు.

అయోధ్యకు సైకిల్‌ యాత్ర

గౌరిబిదనూరు: అయోధ్యలో బాలరాముడిని దర్శించుకునేందుకు మంచేనహళ్లి సమీపంలోని రాయనకల్లు గ్రామానికి చెందిన యువకుడు భానుప్రకాశ్‌ (22) సైకిల్‌ యాత్ర చేపట్టాడు. గురువారం ఆయన డీ పాళ్య (దారినాయకనపాళ్య)లో తాలూకా విశ్వహిందూ పరిషత్‌ నేతృత్వంలో సాయిబాబా, ఇతర ఆలయాల్లో పూజలు నిర్వహించి సైకిల్‌పై అయోధ్యకు బయల్దేరాడు. సుమారు 40 రోజుల్లో అయోధ్య చేరుకుంటానని యువకుడు తెలిపాడు. బాలరాముడిని దర్శించుకొని వీలైతే తిరిగి సైకిల్‌పైనే స్వగ్రామానికి వస్తానని భాను ప్రకాశ్‌ తెలిపాడు. ఆయనకు వీడ్కోలు పలికిన వారిలో విశ్వహిందూ పరిషత్‌ తాలూకా అధ్యక్షుడు సాగానహళ్లి శివకుమార్‌, హోటల్‌ రమేశ్‌బాబు, మారుతి, హరీశ్‌ శెట్టి, మైలప్ప, రవి, శ్రీనివాస కల్యాణ, ఆదినారాయణప్ప తదితరులు పాల్గొన్నారు.

పరిహారాన్ని రుణాలకు   జమ చేయడం క్రూరం
1/1

పరిహారాన్ని రుణాలకు జమ చేయడం క్రూరం

Advertisement
 
Advertisement
 
Advertisement