అదానీ పోర్టు నుంచి బొగ్గు సరఫరా ప్రారంభం | Sakshi
Sakshi News home page

అదానీ పోర్టు నుంచి బొగ్గు సరఫరా ప్రారంభం

Published Sat, May 18 2024 7:15 AM

-

ఉక్కునగరం: 35 రోజులుగా స్టీల్‌ప్లాంట్‌కు అదానీ పోర్టు నుంచి నిలిచిపోయిన బొగ్గు సరఫరా శుక్రవారం వేకువజాము నుంచి ప్రారంభమైంది. దీంతో స్టీల్‌ప్లాంట్‌కు బొగ్గు కష్టాలు తీరనున్నాయి. బొగ్గు సరఫరా ప్రారంభం కావడంపై ఉక్కు ఉద్యోగులు హర్షం ప్రకటించారు. అదానీ గంగవరం పోర్టులో ఏర్పడిన కార్మిక వివాదం వల్ల సుమారు రూ. 500 కోట్ల విలువైన 3 లక్షల టన్ను బొగ్గు, లైమ్‌స్టోన్‌ సరఫరా గత నెల 12 నుంచి నిలిచిపోయింది. దీంతో స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి సంక్షోభంలోకి పడింది. జిల్లా యంత్రాంగానికి యాజమాన్యం విన్నవించినా స్పందన కానరాలేదు. ఈ పరిస్థితుల్లో ఉక్కు అధికారుల సంఘం (సీ) ప్రధాన కార్యదర్శి కేవీడీ ప్రసాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకోవాలని అటు గంగవరం పోర్టుకు, ఇటు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయినప్పటికి పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో కోర్టు దిక్కారణ పిటిషన్‌ను కేవీడీ ప్రసాద్‌ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి తక్షణం బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్‌ సమక్షంలో జరిగిన చర్చల్లో గంగవరం పోర్టు యాజమాన్యం, అక్కడి కార్మికుల మధ్య ఒప్పందం జరిగింది. ఒప్పందం నేపథ్యంలో వెంటనే కార్మికులు విధుల్లో చేరగా ఉదయం నుంచి ప్లాంట్‌కు బొగ్గు సరఫరా ప్రారంభమైంది. బొగ్గు సరఫరా ప్రారంభం కావడంపై స్టేక్‌ హోల్డర్లకు స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌ భట్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement