ఆ రెండు పార్టీలపై బీజేపీ చార్జిషీట్లు! | Sakshi
Sakshi News home page

ఆ రెండు పార్టీలపై బీజేపీ చార్జిషీట్లు!

Published Fri, Apr 19 2024 4:54 AM

BJP charge sheets on those two parties - Sakshi

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను చార్జిట్ట్లలో పొందుపరచాలని నిర్ణయం 

పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ తప్పిదాలను ఎత్తిచూపుతూ.. 

హామీల పేరిట కాంగ్రెస్‌ నిర్వాకాన్ని విమర్శిస్తూ అభియోగపత్రాలు 

25న నామినేషన్ల ఘట్టం ముగిశాక వివిధ రూపాల్లో విస్తృత ప్రచారం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీల కంటే ఎక్కువ మెజారిటీ సీట్లను గెలిచి సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కనీసంగా పది నుంచి పన్నెండు స్థానాల్లో గెలుచుకునేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేస్తోంది.

ఈ క్రమంలోనే ఆ రెండు పార్టీలను ల క్ష్యంగా చేసుకుని ‘అభియోగ పత్రాలు’(చార్జి షీట్లు) విడుదల చేయాలని నిర్ణయించింది. పదేళ్ల పాల నలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాల్పడిన తప్పి దాలు, కుంభకోణాలను ఎత్తిచూపడంతో పాటు ప్రధాన వాగ్దానాలను నిలబెట్టుకోని నిర్వాకాన్ని చార్జిషీట్లలో ఎత్తిచూపాలని నిర్ణయించినట్టు పార్టీవర్గాల సమాచారం.

ఇక కాంగ్రెస్‌ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో పాటు అనేక హామీలిచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ చార్జిట్ట్లు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఎన్నికల ప్రచారం ఊపందుకోనున్న నేపథ్యంలో సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై చార్జిట్ట్ల సమర్పణకు బీజేపీ సమాయత్తమవుతోంది.  

తెలంగాణకూ ‘సంకల్ప పత్రం’ 
ఈ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి మెజారిటీ ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు చేకూర్చే ప్రయోజనాల గురించి అదనంగా సంకల్పపత్రంలో చేర్చాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇటీవలే బీజేపీ జాతీయ నాయకత్వం ఢిల్లీలో సంకల్పపత్రం పేరిట పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి అదనంగా తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలను చేర్చాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించిందని అంటున్నారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో విడిగా ఒక్క రాష్ట్రానికి మేనిఫెస్టో అంటూ ప్రకటించడం సరికాదని భావించిన బీజేపీ నేతలు.. జాతీయపార్టీ ఎన్నికల ప్రణాళికకు అదనంగా ఓ సంకల్పపత్రాన్ని జత చేయాలని సమాలోచనలు చేస్తున్నారు. ఈ నెల 25న నామినేషన్ల దాఖలు ముగిశాక రాష్ట్రానికి సంబంధించిన సంకల్పపత్రాన్ని విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

2019 ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలిచాక,రాష్ట్రానికి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపంలో చేకూర్చిన ప్రయోజనాలు, అందించిన సహాయసహకారాల గురించి ఇందులో పొందుపరచనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బీజేపీని అత్యధిక సీట్లలో గెలిపిస్తే.. కేంద్రం ద్వారా అంతకు మించి ఎన్నో రెట్లు లబ్ధి చేకూరుస్తామని హామీనివ్వాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.  

Advertisement
Advertisement