Obstructing field: జడ్డూ కావాలనే చేశాడా?.. సీఎస్‌కే కోచ్‌ స్పందన ఇదే! | Sakshi
Sakshi News home page

Obstructing field: జడ్డూ కావాలనే చేశాడా?.. సీఎస్‌కే కోచ్‌ స్పందన ఇదే!

Published Mon, May 13 2024 12:35 PM

జడ్డూ అవుటైన తీరుపై కోచ్‌ స్పందన (PC: Jio Cinema)

రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’గా అవుటైన మూడో బ్యాటర్‌గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్‌-2024 నేపథ్యంలో చెపాక్‌ వేదికగా చెన్నై- రాజస్తాన్‌ ఆదివారం తలపడ్డాయి. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి కేవలం 141 పరుగులు చేసింది.

ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై ఐదు వికెట్లు నష్టపోయి 18.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఐదు వికెట్ల తేడాతో రాజస్తాన్‌ను ఓడించి ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచింది.

‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’ 
ఇదిలా ఉంటే.. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జడ్డూ పరుగుల తీసే క్రమంలో.. ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నట్లుగా తేలడంతో ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’ నిబంధన కింద అవుటయ్యాడు.

అవేశ్‌ ఖాన్‌ వేసిన 16వ ఓవర్లో జడేజా లేని రెండో పరుగుకు పరుగెత్తాడు. మరో ఎండ్‌లో ఉన్న రుతురాజ్‌ గైక్వాడ్‌తో సమన్వయలోపం కారణంగా పరుగుకు ఆస్కారం లేకపోయినా క్రీజును వీడాడు. 

అయితే, వెంటనే ప్రమాదం పసిగట్టి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా.. రాజస్తాన్‌ వికెట్‌ కీపర్, కెప్టెన్‌‌ సంజూ శాంసన్‌ వికెట్లకు మీదకు వేసిన త్రోకు అడ్డుగా పరుగెత్తగా బంతి జడేజాకు తగిలింది.

మైక్‌ హస్సీ స్పందన
ఈ నేపథ్యంలో రాయల్స్‌ ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా ఫీల్డ్‌ అంపైర్లు టీవీ అంపైర్‌కు నివేదించారు. రిప్లేను పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ జడ్డూను ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’ రూల్‌ కింద అవుట్‌గా ప్రకటించాడు. ఈ విషయంపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ స్పందించాడు.

‘‘నేను మరీ అంత దగ్గరగా గమనించలేకపోయాను. అయితే, అతడు స్ట్రెయిట్‌గా పరిగెత్తేక్రమంలో యాంగిల్‌ను మార్చుకోకుండానే ముందుకు సాగాడు.ఇరువైపులా వాదనలు ఉంటాయి. అయితే, అంపైర్‌దే తుదినిర్ణయం. నా అభిప్రాయం ప్రకారం.. నిబంధనలకు అనుగుణంగా ఇది సరైన నిర్ణయమే’’ అని మైక్‌ హస్సీ స్పష్టం చేశాడు.

చదవండి: ఆర్సీబీ విజయం: అనుష్క శర్మ సెలబ్రేషన్స్‌.. కోహ్లి రియాక్షన్‌ వైరల్‌

 

Advertisement
 
Advertisement
 
Advertisement