నీకు చేతకాకపోతే తప్పుకో...నేను చేసి చూపిస్తా | Sakshi
Sakshi News home page

నీకు చేతకాకపోతే తప్పుకో...నేను చేసి చూపిస్తా

Published Thu, Feb 15 2024 1:01 AM

Harish Rao Fires On Congress Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించడం చేతకాకపోతే తప్పుకొని ప్రభుత్వాన్ని తమకు అప్పగించాలని, రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రాజెక్టును పునరుద్ధరిస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ చేశారు. ‘నాకు చేత కాదు.. నువ్వు చేసి చూపించమని రేవంత్‌ అడిగితే నేను సిద్ధం.. నాకు బాధ్యత అప్పగిస్తే చేసి చూపిస్తా’ అని అన్నారు. బుధవారం బీఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడా రు.

‘శాసనసభ పవిత్రత, సంప్రదాయాలను సీఎం రేవంత్‌ మంట గలుపుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బురద రాజకీయాలకు పాల్పడుతోంది. ప్రభుత్వం ఎంత తక్కువ చేసి మాట్లాడినా కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని, ప్రజలకు జీవధార. ఈ ప్రాజెక్టు విషయంలో మేము ఎలాంటి తప్పు చేయలేదు. ఈ విషయంలో ఏ తరహా విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం. విచారణ జరిపి బాధ్యులను శిక్షించండి..’అని హరీశ్‌రావు అన్నారు. 

రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి 
‘ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలను పరిష్కరించి, యుద్ధ ప్రాతిపదిక మరమ్మతు పనులు పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలి. రెండు పిల్లర్లు కుంగాయనే నెపంతో మొత్తం ప్రాజెక్టు ప్రతిష్టను డామేజ్‌ చేసే దుష్టపన్నాగానికి కాంగ్రెస్‌ పాల్పడుతోంది. కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసి పొలాలకు నీళ్లు మళ్లించండి కానీ తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు. కాళేశ్వరం ద్వారా 20 లక్షల ఎకరాలకు ప్రయోజనం కలిగింది.

ప్రాజెక్టు ఫలాల గురించి చెప్పకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం దు్రష్పచారం చేస్తోంది. గతంలో కడెంవాగు ప్రాజెక్టు, సింగూరు డ్యాం, ఎల్లంపల్లి, సాత్నాల ప్రాజెక్టులు కొట్టుకుపోయినా పునరుద్ధరించడం జరిగింది. పోలవరం డయాఫ్రం వాల్, రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కారకులను శిక్షించి, ప్రాజెక్టులను పునరుద్ధరించి రైతులకు అన్యాయం జరగకుండా చూస్తారు..’అని హరీశ్‌ వ్యాఖ్యానించారు. 

కాలువలు తవ్వి నీళ్లివ్వకపోతే కష్టాలే 
‘రాజకీయ లబ్ధి కోసమే రేవంత్‌ డైవర్షన్‌ టూర్‌ పెట్టుకుని, ఇంజనీర్లు వాస్తవాలు చెబుతున్నా దబాయిస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో హెడ్‌ వర్క్స్‌ పూర్తయిన తర్వాతే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణంపై నిధులు వెచ్చిస్తాం. కాంగ్రెస్‌ హయాంలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టుల ద్వారా 27 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇస్తే, మేము అన్ని పనులు పూర్తి చేసి 6.36 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం కాలువలు తవ్వి నీరు ఇవ్వకుంటే సాగు, తాగునీటి కష్టాలు వస్తాయి..’అని మాజీ మంత్రి హెచ్చరించారు. 

రీ ఇంజనీరింగ్‌ వల్లే అంచనాల పెంపు 
‘రీ ఇంజనీరింగ్‌ వలన ప్రాజెక్టు అంచనా వ్యయం అనివార్యంగా పెరుగుతుంది. ప్రాణహిత–చేవెళ్ళ ఆంచనా విలువ రూ.17 వేల కోట్లతో మొదలై రూ.38 వేల కోట్లకు పెరిగింది. ఆ తర్వాత కేంద్ర జల సంఘానికి నివేదించే నాటికి రూ.40 వేల కోట్లకు పెరిగింది. తట్ట మట్టి ఎత్తకుండానే ప్రాజెక్టు అంచనా విలువ రూ.17 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు ఎందుకు పెరిగినట్టు?. కాళేశ్వరం ప్రాజెక్టులో జలాశయాల సామర్థ్యం పెంచాం. కొత్త జలాశయాలు ప్రతిపాదించాం. జలాశయాల సామర్థ్యం పెరగడంతోనే అంచనాలు పెరిగాయి..’అని హరీశ్‌రావు వివరించారు.   

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement