ఇదేం ఆదరణ? | Aadharana Scheme Delayed In Prakasam | Sakshi
Sakshi News home page

ఇదేం ఆదరణ?

Published Sat, Dec 1 2018 1:28 PM | Last Updated on Sat, Dec 1 2018 1:28 PM

Aadharana Scheme Delayed In Prakasam - Sakshi

ఆదరణ పథకంలో ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన సెలూన్‌ కుర్చీ విరిగిపోయిందని చూపుతున్న లబ్ధిదారుడు

ఒంగోలు టూటౌన్‌: జరుగుమల్లి కొండలరావు నాయిబ్రాహ్మణ యువకుడు. ఈయన గత 15 ఏళ్లకు పైగా ఒంగోలు సంతపేటలో వెంగమాంబ సెలూన్‌ షాపు పెట్టుకోని జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదరణ పథకం–2 కింద మీసేవలో హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌ చైర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. యూనిట్‌ విలువ రూ.19,500 కాగా లబ్ధిదారుని వాటాగా రూ.1850 చెల్లించారు. ఇటీవల ప్రభుత్వం ఆదరణ పథకం కింద కొండలరావుకు సెలూన్‌ చైర్‌ను అందించారు. కానీ, అది ఒక్క రోజు కూడా పని చేయలేదని, నాసిరకం కుర్చీ అంటగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదరణ పథకం కింద మంజూరు చేసిన నాసిరకం వస్తువులలో ఇది ఒకటిగా బయటపడింది. ఇలా తీసుకున్న  వివిధ రకాల పరికరాల్లో అధిక శాతం నాసిరకంగానే ఉన్నాయని  లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు.

జిల్లాలో ఆదరణ పథకం కింద ఇటీవల మంజూరు చేసిన నసిరకం పరికరాలపై లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకు అందించిన పరికరాలు 70 శాతానికిపైగా ఒక్క రోజు కూడాపనిచేయలేదని మండిపడుతున్నారు. నాసిరకం కంపెనీల పరికరాలు అంటగట్టి తీవ్ర వేదన మిగిల్చారని నిరాశే వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఆదరణ పథకం–2 కింద 2018–19 ఆర్థిక సంవత్సరాలంలో చేతి వృత్తిదారులైన వెనుకబడిన తరగతుల (బీసీలకు) వివిధ పరికరాలు అందించాలని నిర్ణయించింది. మొత్తం 12,710 మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. రూ.10 వేల యూనిట్ల నుంచి రూ.30 వేల విలువైన యూనిట్లను మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు.

ఇందులో 90 శాతం సబ్సిడీ కాగా 10 శాతం లబ్ధిదారుని వాటాగా నిర్ణయించారు. మొత్తం రూ.35.13 కోట్ల నిధులు కేటాయించారు. ఈ పథకం కింద ఒకసారి రుణం తీసుకుంటే మరో పథకం కింద రుణం తీసుకునే వీలులేదన్న నిబంధనలతో బీసీలు దరఖాస్తుచేసుకోకుండా వెనుకంజ వేశారు. సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వెంటనే నిబంధనలను సడలించారు. దరఖాస్తు చేసుకునే గడువు కూడా పొడిగించారు. దాదాపు 10  వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఎంపికైన లబ్ధిదారులకు మూడు విడతలుగా ఇవ్వాలని కూడా నిర్ణయించారు. తొలివిడతగా 5,176 మందికి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నవంబర్‌ 12న జిల్లాలో మెగా రుణమేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రితోపాటు టీడీపీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గోని బీసీలతో పాటు ఇతర కార్పొరేషన్ల లబ్ధిదారులకు వివిధ రకాల యూనిట్లను పంపిణీ చేశారు. బీసీలకయితే సన్నాయి, డోలు, హర్మోనియం, ఇస్త్రీ పెట్టెలు ఇలా పలు రకాల వస్తువులను కొద్దిమందికి అందించి చేతులు దులుపుకున్నారు. రుణమేళా విజయవంతమయిందని సంబర పడ్డారు.

వస్తువులను వెనక్కు తీసుకున్న అధికారులు..
రుణమేళాలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన కొన్ని పరికరాలను వెనక్కు తీసుకున్నట్లు సభ దగ్గరే చర్చలు మొదలయ్యాయి. కేవలం పబ్లిసిటీ కోసమే కొన్ని పరికరాలను తేవడం జరిగిందని, తిరిగి వాటిని తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తరువాత మీ పరికరాలను పిలిచి ఇవ్వడం జరుగుతుందని లబ్ధిదారులను అక్కడ నుంచి పంపించడంతో చాలా మంది నిరాశేతో వెనుదిరగాల్సి వచ్చింది. అందులో భాగంగానే వెంగమాంబ సెలూన్‌ షాపు యజమాని జరుగుమల్లి కొండలరావుని ఒంగోలులోని మార్కెట్‌ యార్డుకు పిలిపించి హెయిర్‌ కటింగ్‌ చైర్‌ను అందించారు. తీసుకున్న వస్తువు తొలిరోజు నుంచే పనిచేయలేదని లబ్ధిదారుడు æపనిచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీ కార్పొరేషన్‌ చుట్టు ప్రదక్షిణలు..
లబ్ధిదారుడు కొండలరావు తనకు జరిగిన అన్యాయంపై బీసీ కార్పొరేషన్‌ చుట్టూ పలుమార్లు తిరిగాడు. తనకు ఇచ్చిన చైర్‌ (కుర్చీ) విషయాన్ని విన్నవించాడు. రేపు చూద్దాం.. మాపు చూద్ధాం అంటూ నేటికి సమస్య పరిష్కరించలేదని బాధితుడు వాపోయాడు. ఒకాయన మరీ వెటకారంగా ‘సీఎం దగ్గరకు వెళ్లు ఆయన కొత్త చైర్‌ ఇస్తాడు’ అంటూ మాట్లాడినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం తనకు మంజూరు చేసిన కుర్చీపై కంపెనీ పేరు, ఊరు, ఇలా ఎలాంటి అడ్రస్‌ లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. తనలాగా చాలమంది లబ్ధిదారులకు అందించిన వస్తువులు చాలా వరకు నాసిరకమైనవేనని తెలిపారు. ఈ విషయాన్ని చెప్పుకోలేక చాలా మంది వదిలేశారని తెలిపారు.

10 ఏళ్ళ నాటి కుర్చిలు నేటికీ చెక్కు చెదరలేదు  
బాధితుడు జరుగుమల్లి కొండలరావు పదేళ్లకు ముందు కొన్న చైర్‌లు నేటికి చెక్కు చెదరలేదని తాను షాపు ప్రారంభించిన నాడు కొన్న సెలూన్‌ చైర్‌లను చూపించాడు. ఒరిజినల్‌ కంపెనీ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన చైర్‌ ఒక్క  రోజకే విరిగిపోయిందన్నాడు.

అన్ని నాసిరకం వస్తువులే..
ప్రభుత్వం ఆదరణ పథకం కింద అందిస్తున్న వస్తువులన్నీ నాసిరకం వస్తువులేనని బీసీ సంక్షేమ సంఘం నాయకులు బంకా చిరంజీవి తెలిపారు. కేవలం నాలుగు వేలు కూడా చేయని చైర్‌లను రూ.19,500 కొనుగోలు చేసి బీసీలకు అంటగడుతున్నారని మండిపడ్డారు. పైగా ఈ డబ్బులు మూడేళ్ల నాడు కేంద్రం రూ.150 కోట్లను విడుదల చేసిందని తెలిపారు. ఆ నిధులు ప్రభుత్వం వద్ద ఉంచుకోని, దానిపై వచ్చే వడ్డీతో నాసిరకం వస్తువులు కొనుగోలుచేసి బీసీలను ఆదుకుంటున్నామని చెప్పడం దుర్మార్గామని తెలిపారు. ప్రస్తుతం ఉన్నయూనిట్‌ విలువ రూ.30 వేలకు మరో రూ. 20 వేలు కలిపి మొత్తం రూ.50 వేలుగా లబ్ధిదారునికి మంజూరు చేస్తే సొంతంగా తనకు కావాల్సిన వస్తువులను లబ్ధిదారులే కొనుగోలు చేసుకుంటారని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement