పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు.
కర్నూలు : పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఏపీ డీజీపీ జేవీ రాముడు తెలిపారు. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తూ మార్గమధ్యంలో కర్నూలు ఏపీఎస్‌పీ రెండవ పటాలంలో రూ.82 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆయుధాగారానికి మంగళవారం ఉదయం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా ఉంచేందుకు నల్లమల అడవుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కొనసాగుతోందన్నారు.
అడవుల్లోకి వెళ్లిన ఎర్రచందనం స్మగ్లర్లను కట్టడి చేసేందుకు నిఘా పెంచామని చెప్పారు. ఎర్రచందనం దొంగలకు శిక్షలు పడేలా చట్టాన్ని సవరణ చేసేందుకు కేంద్రానికి నివేదిక పంపినట్లు చెప్పారు. ఎర్రచందనం దొంగల విచారణకు ప్రత్యేక కోర్టు కోసం కూడా నివేదించామన్నారు. పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కర్నూలు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా తగ్గడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.