సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ల దగ్గర పోలీసు పహారాను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా 400/220/133 కేవీ సబ్‌స్టేషన్ల దగ్గర సంచార పోలీసు దళాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఆదేశించారు.
సంచార పోలీసు దళాల ఏర్పాటు..
అవసరమైన ప్రాంతాలకు అదనపు బలగాలు తరలింపు
సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్లు, ఎస్పీలు,
విద్యుత్ ఇంజనీర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో విద్యుత్ సబ్ స్టేషన్ల దగ్గర పోలీసు పహారాను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా 400/220/133 కేవీ సబ్‌స్టేషన్ల దగ్గర సంచార పోలీసు దళాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఆదేశించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు సీమాంధ్ర జిల్లాల్లో శాంతిభద్రతలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యుత్ ఇంజనీర్లతో సోమవారం సచివాలయం నుంచి సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతలను ఎట్టిపరిస్థితుల్లోను పరిరక్షించాలని, ఈ విషయంలో రాజీపడరాదని సీఎస్ స్పష్టం చేశారు. అవసరమైన ప్రాంతాలకు అదనపు పోలీసు బలగాలను తరలించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులతో పాటు, ప్రజాప్రతినిధుల ఆస్తులను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ల దగ్గరకు బయటి వ్యక్తులను అనుమతించరాదని, అలాంటి వారిని ముందస్తు అరెస్టులు చేయాలని ఆయన సూచించారు. విధులకు హాజరవుతున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలని, జిల్లా స్థాయిలో ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులతో కలెక్టర్లు, ఎస్పీలు, డిస్కం ఇంజనీర్లు సంప్రదింపులు జరుపుతూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ కోరారు. ైరె ళ్లకు రాత్రిపూట పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంటే దగ్గరలోని రైల్వే స్టేషన్లలో రైళ్లను నిలుపుదల చేయాలని సూచించారు. రెవెన్యూ మెజిస్ట్రేట్ శాంతిభద్రతల పరిరక్షణ విధులను నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఆసుపత్రులకు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా సక్రమంగా సాగేలా చర్యలు తీసుకోవడంతో పాటు రైల్వే ట్రాక్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అత్యవసర సేవలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. సమ్మె చేస్తున్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో బుధవారం ముఖ్యమంత్రి సమావేశమై చర్చలు జరుపుతారని ఈ సందర్భంగా సీఎస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీజీపీ ప్రసాదరావు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డిస్కం ఇంజనీర్లు, కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.