విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వాధికారుల జరిపిన చర్చలు ఫలించలేదు.
హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వాధికారుల జరిపిన చర్చలు ఫలించలేదు. దాంతో సమ్మె కొనసాగుతోంది. కాగా తమ చర్చలు ఇంకా ముగియలేదని, డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన రాలేదని విద్యుత్ జేఏసీ కో ఛైర్మన్ సీతారాంరెడ్డి తెలిపారు. అంతవరకూ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు విద్యుత్ శాఖ ఉద్యోగులు సమ్మె విరమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు అయిన తర్వాతే పే రివిజన్ ఉంటుందని అంతవరకూ విద్యుత్ ఉద్యోగులు కాస్త ఓపిక పట్టాలన్నారు. ఇందుకు సంబంధించి కొత్త ముఖ్యమంత్రుల వద్దకు ఫైళ్లు పంపిస్తామని మహంతి తెలిపారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడే తరుణంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు.
ఏప్రిల్ నుంచి ఏరియర్స్ అందుతాయని ఆయన పేర్కొన్నారు. సమ్మె చేస్తే ఆస్పత్రులు, రైల్వేలు, తాగునీటికి పెను ఇబ్బంది ఏర్పడుతుందని మహంతి అన్నారు. పే రివిజన్తో ప్రభుత్వాలపై రూ.1250 కోట్ల మేర అదనపు భారం పడుతుందని ఆయన తెలిపారు. కాగా వేతన సవరణ (పీఆర్‌సీ) అమలుపై యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.