
ఫైల్‌ఫోటో
సాక్షి, విశాఖపట్నం : ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో తుపాకులు మోతలు మోగుతున్నాయి. తాజాగా విశాఖ ఏజెన్సీలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని పెదబయలు మండలం లండులు అటవీ ప్రాతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. గత కొంత కాలంగా మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న బలగాలు.. ఆదివారం సాయంత్రం రెక్కీ నిర్వహించాయి. ఆ సమయంలోనే లండులు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారస పడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొంత సమయం పాటు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. (మావోయిస్టు భాస్కర్ దశాబ్దాల అజ్ఞాతం)
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వర్గాలు ప్రకటించాయి. అయితే సంఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన సామాగ్రీ లభించినట్లు సమాచారం. కాగా గతకొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలను మావోయిస్టు పార్టీ వేగవంతం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ఆదిలాబాద్, అసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలపాలపై పోలీసులు బలగాలు నిఘా పెట్టాయి.