
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్వీడన్ టెలికం సంస్థ ఎరిక్సన్‌కు బాకీ చెల్లింపునకు ఆదాయ పన్ను రిఫండ్ ద్వారా తమ బ్యాంక్ ఖాతాకు వచ్చిన రు.260 కోట్లను వినియోగించాలన్న ఆర్‌కామ్ ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగింది. ఇందుకు అనుమతించాలంటూ ఆర్‌కామ్ చేసిన విజ్ఞప్తిని ఫైనాన్షియల్ క్రెడిటార్స్ (రుణ దాతలు) తోసిపుచ్చారు. ఈ మేరకు తమ వాదనలను ఎన్‌సీఎల్‌ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్)లో వినిపించారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్‌కామ్.. ప్రస్తుతం దివాలా ప్రక్రియ అమలు కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) ఆశ్రయించాలని నిర్ణయించింది. దీనితో సంస్థ ఏ చెల్లింపులు జరపాలన్నా తప్పనిసరిగా రుణదాతల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
ఆదాయపు పన్ను రిఫండ్స్ ఆర్‌కామ్ వినియోగంపై విధించిన మారటోరియంను తొలగించాలని అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆర్‌కామ్ ఆశ్రయించింది. ఆయితే మారటోరియం తొలగించరాదని రుణ గ్రహీతలు తమ వాదనలు వినిపించారు. కేసు తదుపరి విచారణ మార్చి 11న జరుగుతుంది. 8వ తేదీలోపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)సహా కంపెనీ ఫైనాన్షియల్ క్రెడిటార్స్ తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుంది. ఎరిక్‌సన్‌కు బకాయిల కేసులో ఇప్పటికే ఆర్‌కామ్ 118 కోట్లు డిపాజిట్ చేసింది. మిగిలిన మొత్తం రూ.453 కోట్లను నాలుగు వారాల్లో చెల్లించకుండా మూడు నెలలు కంపెనీ చీఫ్ అనిల్ అంబానీ, మరో ఇరుగ్రూపు సంస్థల డైరెక్టర్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ఈ నెల 20వ తేదీన అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. దీనితో కంపెనీ నిధుల సమీకరణ ప్రయత్నాలను తీవ్రతరం చేసింది.