విదేశాల్లో అక్రమాస్తులు, అక్రమాదాయం ఉన్నవారు.. వాటి వివరాలను స్వచ్ఛందంగా వెల్లడి చేసే అవకాశం కల్పించడాన్ని...
‘బ్లాక్‌మనీ విండో’పై కేంద్రం
న్యూఢిల్లీ: విదేశాల్లో అక్రమాస్తులు, అక్రమాదాయం ఉన్నవారు.. వాటి వివరాలను స్వచ్ఛందంగా వెల్లడి చేసే అవకాశం కల్పించడాన్ని ఆదాయ సమీకరణ మార్గంగా భావించడం లేదని శుక్రవారం కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ‘విదేశాల్లో అక్రమాస్తులున్నవారికి నల్లధనం చట్టం కింద జైలు శిక్షను, భారీ జరిమానాను తప్పించుకునేందుకు ఇది చివరి అవకాశం. దీనికి ప్రభుత్వం ఆదాయ లక్ష్యమేదీ నిర్దేశించలేదు’ అని అన్నారు.
నల్ల ధనవంతులకు 90 రోజుల గడవుతో ఈ అవకాశం కల్పించామన్నారు. ఈ అవకాశం జూలై1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. ఆ లోపు విదేశీ అక్రమాస్తుల వివరాలను వెల్లడి చేసినవారు ఆ మొత్తం విలువలో 60% పన్ను, జరిమానా చెల్లిస్తే సరిపోతుంది. గడువు దాటితే అది 120% వరకు పెరగడంతో పాటు, జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాగా, విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని ఈ-ఫైలింగ్ ద్వారా వెల్లడి చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆన్‌లైన్‌లో సమర్పించే పత్రాలపై డిజిటల్ సంతకాన్ని తప్పనిసరి చేసింది. ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్‌లో ఈ మేరకు ఏర్పాటు చేసింది.