
న్యూఢిల్లీ: విశ్వవ్యాప్తమైన హింస, ద్వేషం, ఉగ్రవాదం, ఘర్షణల నుంచి విముక్తి కోరుకునే ప్రపంచ దేశాలకు భారతీయ జీవన విధానం ఒక ఆశారేఖ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. శాంతి, సామరస్యపూర్వక జీవన విధానం కారణంగానే భారతీయ నాగరికత వర్ధిల్లిందన్నారు. బల ప్రదర్శన ద్వారా కాకుండా, శాంతి చర్చల ద్వారానే ఘర్షణలను నిరోధించగలమన్నది భారతీయుల విధానమన్నారు. కేరళలోని కోజికోడ్–ఐఐఎంలో గురువారం ‘గ్లోబలైజింగ్ ఇండియన్ థాట్’ పేరుతో జరుగుతున్న సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో సందేశం ఇచ్చారు. ఆంక్షలు లేనిచోటే సృజనాత్మకత, భిన్నాభిప్రాయం సహజంగా వస్తాయని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మన విధానాలు సులభంగా, ఆచరణయోగ్యంగా ఉంటాయని తెలిపారు. ‘భారత్ అభివృద్ధి సాధిస్తే ప్రపంచం పురోగమిస్తుంది. ప్రపంచం అభివృద్ధి చెందితే భారత్‌కు లబ్ధి చేకూరుతుంది. ఇదే మన విశ్వాసం’ అన్నారు. ఈ సందర్భంగా ఐఐఎం క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.