భారత క్రికెట్‌కు మూలస్థంభంలాంటి ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ ‘రంజీ ట్రోఫీ’కి నగారా మోగింది. 2013-14 సీజన్ మ్యాచ్‌లు ఆదివారంనుంచి ప్రారంభం కానున్నాయి.
ముంబై: భారత క్రికెట్‌కు మూలస్థంభంలాంటి ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ ‘రంజీ ట్రోఫీ’కి నగారా మోగింది. 2013-14 సీజన్ మ్యాచ్‌లు ఆదివారంనుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు నాలుగు రోజుల పాటు జరిగే తొలి రౌండ్‌లో భాగంగా మొత్తం 12 మ్యాచ్‌లు జరుగుతాయి. గత ఏడాదిలాగే ఈ సారి కూడా మొత్తం 27 జట్లను ‘ఎ’, ‘బి’, ‘సి’ పేర్లతో మూడు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో జట్టు తన గ్రూప్‌లోని ఇతర జట్లతో ఎనిమిదేసి లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. ‘ఎ’, ‘బి’లనుంచి చెరో 3 జట్లు, గ్రూప్ ‘సి’ నుంచి 2 జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
లీగ్ దశలో ‘ఎ’, బి’ గ్రూప్‌లలో చివరి స్థానాల్లో నిలిచిన జట్లు వచ్చే సీజన్‌కి గ్రూప్ ‘సి’ కి పడిపోతాయి. గ్రూప్ ‘సి’ లో తొలి రెండు స్థానాలు సాధించిన జట్లు గ్రూప్ ‘ఎ’, ‘బి’ లలో ఆడేందుకు ప్రమోషన్ దక్కించుకుంటాయి. ఇప్పటి వరకు ముంబై అత్యధికంగా 40 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్, ఆంధ్ర జట్లు తలపడనున్నాయి. గ్రూప్ ‘సి’లో ఈ రెండు జట్లతో పాటు మహారాష్ట్ర, అస్సాం, కేరళ, గోవా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, త్రిపుర ఉన్నాయి.