Earth Hour Day
-
ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్.. అంతటా అంథకారం.. కారణమిదే..
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని చారిత్రక ప్రదేశాలకు ఉన్నట్టుండి ఒక్కసారిగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడాన్ని ఎప్పుడైనా చూశారా?. రాత్రివేళ ఎప్పుడూ కాంతులీనే ఈ ప్రాంతాల్లో అంథకారం అలముకుంటే ఎలా ఉంటుంది? ఇటువంటి దృశ్యం శనివారం కనిపించింది. డబ్ల్యూడబ్యూఎఫ్ ఇండియా ఎర్త్ అవర్ సెలబ్రేషన్ 2025 కింద ఈ విధంగా చారిత్రక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.శనివారం సాయంత్రం ఇండియా గేట్, ఎర్రకోట, రాష్ట్రపతి భవన్, విక్టోరియా మెమోరియల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్.. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పలు చారిత్రక ప్రదేశాలలో లైట్లు ఆపివేశారు. ఈ ఏడాది 19వ ఎర్త్ అవర్(Earth Hour) ప్రపంచ జల దినోత్సవంతో పాటు జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగీతకారుడు, డబ్ల్యూడబ్యూఎఫ్ ఇండియా హోప్ అండ్ హార్మొనీ రాయబారి శంతను మొయిత్రా తన సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఎర్త్ అవర్ సందర్భంగా రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు చారిత్రక ప్రాంతాల్లో విద్యుత్ ఉపకరణాలను ఆపివేయడం ద్వారా ఢిల్లీలో దాదాపు 269 మెగావాట్ల విద్యుత్తును ఆదా చేశారు.ఎర్త్ అవర్ అనేది విద్యుత్తును ఆదా చేసే ప్రచార కార్యక్రమం. ప్రజలు తమ దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ప్రపంచంపై పడే భారాన్ని తగ్గించవచ్చని ఎర్త్‌డే చెబుతుంది. నీటిని ఆదా చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్(Single-use plastic) వాడకాన్ని తగ్గించడం, గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం ద్వారా భూమిని కాపాడవచ్చని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఈ ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. గత సంవత్సరం ఢిల్లీలో జరిగిన ఎర్త్ అవర్ సందర్భంగా 206 మెగావాట్ల విద్యుత్ ఆదా అయిందని పలు నివేదికలు చెబుతున్నాయి.ఇది కూడా చదవండి: అమర వీరులకు ప్రముఖుల నివాళులు -
ఇవాళ గంటపాటు "స్విచ్ ఆఫ్"
మనిషికి జీవనాధారమైన భూమిని ఆహ్లాదంగా ఉండేలా ప్రయత్నిస్తే.. ఆటోమేటిగ్గా అన్ని బాగుంటాయి. అందుకోసమే ప్రంపచవ్యాప్తంగా ఉన్న మానవళి ప్రయోజనార్థమే లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు సామాజికవేత్తలు. అలా ఏర్పాటైనవే ప్రకృతికి సంబధించిన దినోత్సవాలు. ఆ విధంగా వచ్చిన వాటిలో ఒకటి ఈ ఎర్త్ అవర్. అసలేంటిది..? ఆ ఒక్క రోజు.. ఒక్క గంటపాటు పాటించేస్తే నిజంగానే భూమిని కాపాడేసినట్లేనా..? అంటే..?. .ఎర్త్ అవర్ అంటే.. పర్యావరణం కోసం ఒక గంట పాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ఒక కార్యక్రమం. ప్రతి ఏడాది మార్చి నెలలో చివరి శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల మధ్య జరుగుతుంది. ఈపాటికే ఇరు తెలుగు రాష్టాల ప్రభుత్వాలు మార్చి 22 శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఒక గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపేయాలని అధికారికంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేసింది కూడా. అలాగే ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజలందురూ స్వచ్ఛందంగా భాగం కావాలని కోరాయి ఇరు ప్రభుత్వాలు.ఎలా ప్రారంభమైందంటే? 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. WWF (World Wildlife Fund) అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పాటుపడటమే ఈ కార్యక్రమం అసలు లక్ష్యం.ప్రాముఖ్యత ఎందుకు..మన ప్రపంచానికి మన సహాయం కావాలి. మనం తినే ఆహారం నుంచి పీల్చే గాలి వరకు ప్రకృతి మనకు చాలా ఇస్తుంది. అది మనల్ని ఆరోగ్యంగా, అభివృద్ధి చెందేలా చేస్తుంది. డబ్ల్యూబడ్యూఎఫ్(WWF) ఎర్త్ అవర్ అనేది స్విచ్ ఆఫ్ చేసి మనం నివశించే గ్రహానికి(భూమి) తిరిగి ఇవ్వడానికి సరైన సమయం. ఎందుకంటే మనం ప్రకృతిని పునరుద్ధరించినప్పుడే అది మనల్ని పునరుద్ధరిస్తుంది.'స్విచ్ ఆఫ్'లో ఉన్న ఆంతర్యం..ఎర్త్ అవర్ అంటే కేవలం లైట్లు ఆర్పేయడం మాత్రమే కాదు - మానసికంగా "స్విచ్ ఆఫ్" చేసి అంతర్ముఖులం కావడమే. అంటే ఇది వరకు చూడండి కరెంట్ పోతే చాలు అంతా బయటకు వచ్చి ముచ్చటలు ఆడుకునేవాళ్లు. ఆ వసంతకాలం వెన్నెలను వీక్షిస్తూ భోజనాలు చేస్తూ..హాయిగా గడిపేవాళ్లం గుర్తుందా..?. అచ్చం అలాగన్నమాట. ప్రకృతితో గడపటం అంటే ఏ అడువులో, ట్రెక్కింగ్‌లే అక్కర్లేదు..మన చుట్టు ఉన్న వాతావరణంతో కాసేపు సేదతీరుదాం. చిన్న పెద్ద అనే తారతమ్య లేకుండా ఫోన్ స్క్రీన్లతో గడిపే మనందరం కాసేపు అన్నింటికి స్విచ్ ఆఫ్ చెప్పేసి.. మనుషులతోనే కాదు మనతో మనమే కనెక్ట్ అవుదాం. తద్వారా గొప్ప మానసిక ఆనందాన్ని పొందుతాం కూడా. ఎందుకంటే సెల్‌ఫోన్ లేకుండా ప్రాణామే లేదన్నట్లుగా హైరానా పడుతున్న మనకు ఆ ఒక్క గంట అమూల్యమైన విషయాలెన్నింటినో నేర్పిస్తుందంటున్నారు మానసిక నిపుణులు.మరి అంత గొప్ప ఈ కార్యక్రమంలో మనం కూడా పాల్గొందామా..!. ఇది కేవలం భవిష్యతరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడమే గాక మనకు ఈ ఒక్క గంట లైట్స్ ఆపి చీకటిలో గడిపే చిన్నపాటి విరామంలో అయినా మనలో ఆరోగ్యం, ప్రకృతిని రక్షించుకోవాలనే మార్పు వస్తుందేమోనని ఆశిద్దాం.(చదవండి: ఫుడ్ ప్యాకేజింగ్ లేబుల్స్‌లో ఇంత మోసమా..? వైరల్‌గా హర్ష గోయెంకా పోస్ట్) -
ప్రకృతిని ప్రేమిద్దాం.. పుడమి పరిరక్షిద్దాం
రేపు ఎర్త్ అవర్ డే నేడు విద్యార్థులకు వివిధ పోటీలు ఈ ఏడాది తిరుపతిలో.. ఉరుకుల పరుగుల జీవితం.. పెరుగుతున్న వాహన వినియోగం.. వెరసి ముంచుకొస్తున్న కర్బన ఉద్గార ఉపద్రవం.. తరుగుతున్న ఇంధనం. ఫలితంగా తాగే నీరు.. పీల్చే గాలి.. నివశించే నేల కాలుష్యకాటుకు గురవుతోంది. ఈ పరిణామంతో ప్రకృతి అందాలను కోల్పోతోంది.. పుడమి క్షోభిస్తోంది. ఈ దుస్థితి నుంచి భూమాతను కాపాడి.. మానవ మనుగడకు తోడ్పాటునందించడం అన్నది ఒక్కరితో సాధ్యం కాదు. స్వచ్ఛందంగా ఎవరికి వారు నడుం బిగించాలి. శనివారం ఎర్త్ అవర్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. తిరుపతి ఎడ్యుకేషన్: సౌరకుటుంబంలోని గ్రహాల్లో జీవరాశులు జీవించడానికి అనువైన గ్రహం భూమి మాత్రమే. జీవించడానికి అవసరమైన నీరు భూమి మీద మాత్రమే లభిస్తుంది. దీని ఫలితంగానే జీవరాశుల మనుగడ ఈ గ్రహంపై మాత్రమే ఉంది. జీవ మనుగడకు దోహదం చేస్తున్న గాలి, నీరు, నేల, అగ్ని, ఆకాశం ఈ పంచభూతాల ఆవశ్యకతను మన పెద్దలు గుర్తించి, దైవంతో సమానంగా పూజలు చేయడం ప్రారంభించారు. అయితే పారిశ్రామిక విప్లవం తరువాత భూవాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని వందల సంవత్సరాల తరువాత భూమి నివాసానికి పనికిరాదనే సూచనలు మానవజాతి మనుగడకే ప్రశ్నార్థకమవుతోంది. ఇతర గ్రహాలపై జీవరాశిని కనుగొనడానికి పరిశోధనలు చేస్తున్న మనం భూమిపై ఉన్న జీవరాశిని అపాయకర స్థితికి నెట్టేస్తున్నామని పర్యావరణ ప్రేమికులు గగ్గోలు పెడుతున్నారు. ఎర్త్ అవర్ ఉద్దేశం భూమిపై వెలువడుతున్న కర్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, ఇంధనాలు, విద్యుత్‌ను ఆదా చేయడం కోసం రూపుదిద్దుకున్న ప్రజాచైతన్య ఆచరణే ఎర్త్ అవర్. ప్రకృతిని ప్రే మించాలి... పర్యావరణాన్ని పరిరక్షించాలని మాటలు చె ప్పడం కాకుండా ఆచరణలో పెట్టడమే ఎర్త్ అవర్ ఉద్దేశం. ఏం చేయాలి ప్రతి ఏడాది మార్చి 25వ తేదీ రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు గృహాలు, వాణిజ్య సముదాయాలు, వ్యా పార కేంద్రాలు, పార్కులు తదితర అన్ని ప్రాంతాల్లో (వీధి దీపాలు మినహా) విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆపి ఉంచాలి. అలాగే ఇంట్లో టీవీలను కట్టేయాలి. భూమి ని కాపాడుకోవాలని భావించే ప్రతి వ్యక్తి స్వతహాగా ఎర్త్ అవర్‌ను పాటిస్తూ పొరుగువారిని ప్రోత్సహించాలి. ఎర్త్ అవర్‌పై అవగాహన కల్పించేందుకు 25వ తేదీ రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తారు. విద్యార్థుల్లో అవగాహన నేటి విద్యార్థులే...రేపటి పౌరులు. దీని కోసమే ఎర్త్ అవర్ ఉద్దేశాన్ని విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం పాఠశాల, కళాశాల విద్యార్థులకు వివిధ కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నదే ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్(ఎన్జీసీ). ఎన్జీసీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో 250 ఉన్నత పాఠశాలల్లో పర్యావరణ హిత కార్యక్రమాలను నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తోంది. అలాగే పర్యావరణ దినోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది తిరుపతిలో... తిరుపతిలో ఈ ఏడాది ఎర్త్ అవర్‌ను నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ, తిరుపతి నగరపాలక సంస్థ, రీజినల్ సైన్స్ సెంటర్, లయన్స్ క్లబ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, ఏపీఎస్పీడీఎల్ ఇంజినీర్ల సంఘం, ఆల్ ఇండియా రేడియో సహకారంతో ఎన్జీసీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఎర్త్ అవర్‌ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ఎర్త్ అవర్ ప్రధానాంశంగా చిత్రలేఖనం, సెమినార్, వ్యాసరచనల పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ దేవేంద్రనా«థ్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. 2007లో ఎర్త్‌అవర్... ఓ వైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు అభివృద్ధి పేరుతో సృష్టిస్తున్న విధ్వంసానికి తోడుగా నాగరికత పేరుతో పెరిగిన వాహనాల వాడకం, విద్యుచ్ఛక్తి వలన పునరుద్ధరించలేని స్థితికి ఎన్నో వనరులు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే భూమిని కాపాడుకోవడం కోసం ఒకరిద్దరి మదిలో మెది లిందే ఎర్త్ అవర్. 2007, మార్చి నెలలో ఎర్త్ అవర్ ఉద్యమం తొలుత ఆస్ట్రేలియాలో రూపుదాల్చింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది మార్చి 25న ఎర్త్ అవర్‌ను పాటిస్తున్నారు. ఉద్యమ నిర్మాతలు లీబర్నెట్, ఆండీరిడ్లీ. తిరుపతిలో కొవ్వొత్తుల ర్యాలీ తిరుపతి నగరంలో శనివారం రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు ఎర్త్ అవర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. మున్సిపల్ కార్యాలయం, అలిపిరి సర్కిల్, అన్నమయ్య సర్కిల్, కపిలతీర్థం సర్కిల్, ముత్యాలరెడ్డిపల్లె సర్కిల్, మహతి ఆడిటోరియం, లీలామహల్ సర్కిల్, తిరుచానూరు ఫ్లైవర్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.