
సన్నని వెదురు గొట్టం మాదిరిగా ఉండే సరికొత్త తూనీగ జాతిని కేరళలో పశ్చిమ కనుమల ప్రాంతంలో తాజాగా గుర్తించారు. దీని పొట్ట భాగం పొడవైన స్థూపాకృతిలో అచ్చం సన్నటి వెదురు గొట్టాన్ని తలపించేలా ఉంటుంది. అందుకే దీనికి అగస్త్యమలై బాంబూటెయిల్ (వెదురుతోక) అని పేరు పెట్టారు. దీని శాస్త్రీయనామం మెలనోనౌరా అగస్త్యమలైకా. ఇది మెలనోనౌరా జెనస్ కుటుంబానికి చెందినది. ఆ కుటుంబంలో వెలుగులోకి వచ్చిన రెండో జాతి ఇదని సైంటిస్టులు చెబుతున్నారు.
ఈ తూనీగలు కేరళలో తిరువనంతపురం జిల్లాలో పెప్పర వణ్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మంజడినిన్నవిల ప్రాంత పరిధిలో పుణెలోని ఎంఐటీ వరల్డ్ పీస్ వర్సిటీ, కేరళ క్రైస్ట్ కాలేజీ సైంటిస్టుల బృందం కంటబడ్డాయి. అనంతరం పొన్ముడి కొండల్లో కూడా వీటి ఉనికిని గుర్తించారు. మెలనోనౌరా కుటుంబంలో తొలి తూనీగ జాతిగా మలబార్ బాంబూటెయిల్ గుర్తింపు పొందింది. దాన్ని కూర్గ్–వయనాడ్ ప్రాంతంలో తొలుత గుర్తించారు.
చదవండి: అడవిలో అమ్మప్రేమ.. జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం!
వాటితో పోలిస్తే అగస్త్యమలై తూనీగ (Agasthyamalai Damselfly) జాతిలో దాదాపు 7 శాతం దాకా జన్యూపరమైన తేడాలున్నట్టు తేలింది. పొడవాటి నల్లని శరీరం, నీలిరంగు చారికలు దీని సొంతం. ఇంతటి జీవ వైవిధ్యానికి నిలయమైన పశ్చిమ కనుమలను మరింతగా సంరక్షించాల్సిన అవసరం ఎంతో ఉందని ఎంఐటీ వర్సిటీకి చెందిన డాక్టర్ పంకజ్ కోర్పడే అభిప్రాయపడ్డారు.
– సాక్షి, నేషనల్ డెస్క్