
సాక్షి, చెన్నై: వరుస ఎదురుదెబ్బలు మక్కల్‌నీది మయ్యం వర్గాల్ని డీలా పడేలా చేశాయి. ఆ పార్టీకి ఏకంగా కొన్ని జిల్లాల్లో కార్యదర్శులే కరువయ్యారు. దీంతో ఈ పదవుల భర్తీ కోసం పార్టీ పరంగా ప్రకటన ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశ్వ నటుడు కమలహాసన్ మక్కల్ నీది మయ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భావంతో ఎదుర్కొన్న తొలి లోక్‌సభ ఎన్నికల్లో దక్కిన ఓటు బ్యాంక్ ఆ పార్టీలో కొంత మేరకు ఉత్సాహాన్ని నింపాయి. ఆ తదుపరి స్థానిక సంస్థల ఎన్నికల్లో చతికిల పడ్డారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. పార్టీ అధ్యక్షుడు కమల్ సైతం ఓటమి పాలయ్యారు.
దీంతో పార్టీలోని ముఖ్యులందరూ గుడ్ బై చెప్పడం మొదలెట్టేశారు. అనేకమంది జిల్లాల పార్టీకార్యదర్శులు ఇతరపార్టీల్లోకి వెళ్లి పోయారు. ఇటీవల జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ కమల్ పార్టీకి ఓటమి తప్పలేదు. ప్రస్తుతం పార్టీ బలోపేతం దిశగా కమల్ మళ్లీ అడుగులు వేస్తున్నారు. ప్రజలు ఏదో ఒక రోజు తమకు పట్టం కడుతారనే ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
అనేక జిల్లాల్లో పార్టీ కార్యదర్శులుగా వ్యవహరించేందుకు స్థానికంగా ఉండే ముఖ్యులు ఎవ్వరు ముందుకు రావడం లేదు. ఇప్పటికే జేబులకు పడ్డ చిల్లుతో సతమతం అవుతున్న నేతలకు తమకు పదవులు వద్దు బాబోయ్ అని దాట వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి సేవల్ని అందిస్తున్న కార్యకర్తల్ని ఆ పదవులకు ఎంపిక చేయడానికి సిద్ధమయ్యారు. ఇందుకు కోసం దరఖాస్తులు చేసుకోవాలని మక్కల్ నీది మయ్య పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ప్రస్తుతం కాంచీపురం, చెంగల్పట్టు, దిండుగల్, తంజావూరు, తిరువారూర్, తెన్‌కాశి, విరుదునగర్, తూత్తుకుడి, తదితర 15 జిల్లాలకు కార్యదర్శులు కావాలంటూ.. ప్రకటన ఇచ్చుకో వాల్సిన దుస్థితి ఏర్పడడం గమనార్హం. పార్టీకి సేవల్ని అందించే కార్యకర్తలు, కమల్ మీద నమ్మకం కల్గిన వాళ్లు దరఖాస్తులు చేసుకోవచ్చంటూ ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రకటించడం విశేషం.
చదవండి: Roja Selvamani: ఆ రోజున రోజాకు అభినందన సభ.. ఎందుకంటే ?