
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు జూన్8 వతేదీవరకు ముఖ్యమంత్రిని అన్నారే కానీ, ఆ తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిని అని చెప్పలేకపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తాను ఓడిపోబోతున్నట్లు చంద్రబాబునాయుడు గ్రహించారు కాబట్టే ఇలాంటి మాటలు ఆయన నోటినుంచి వచ్చాయని తెలిపారు. పోలింగ్ పూర్తి అయినప్పటి నుంచి చంద్రబాబు మాటతీరులో మార్పు వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఏవిధమైన ఫలితాలు వచ్చినా హుందాగా స్వీకరించాలని సూచించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. 'ఆరు వారాల్లో 8మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి అంశంపై చంద్రబాబు నాయుడు దృష్టిసారించకుండా ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు. దళితులతో ఓటు వేయించకుండా అక్కడి అగ్రవర్ణాలు అడ్డుపడ్డారని మా పార్టీ చంద్రగిరి అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రగిరిలో మా అభ్యర్థి ఏడు కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని ఏప్రిల్ 12వతేదీన ఫిర్యాదు చేశారు. దానిపై విచారించి ఈసీ ఐదు కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘంకు అన్ని సాక్ష్యాధారాలు అందచేసిన తర్వాతనే ఈ నిర్ణయం వెలువడింది.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దీనిపై చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయుకులు నానా హడావుడి చేస్తున్నారు. చంద్రబాబు రీపోలింగ్ అప్రజాస్వామికం అని ప్రకటిస్తున్నారు. రీపోలింగ్ అప్రజాస్వామికం అని ఎలా చెబుతారు. చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే అసలు ఎన్నికలే అప్రజాస్వామ్యం అన్నట్లుగా ఉంది. చంద్రబాబు తీరు చూస్తే శాశ్వతంగా తానే ముఖ్యమంత్రిగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనో రాజులాగా వారి అబ్బాయి యువరాజులా ఉండాలని భావిస్తున్నట్లున్నారు. వెబ్ క్లిప్పింగ్‌లలో దృశ్యాలు సరైనవా కావా అనేది తెలుగుదేశం పార్టీ స్పష్టం చేయాలి. ఓటమి భయంతో చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. విషయాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రగిరిలో ఐదు కేంద్రాలలో రీపోలింగ్ జరిపితే టీడీపీకీ భయమెందుకు. రీపోలింగ్ వల్ల ఏదో గందరగోళం జరుగుతుందని అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఈవీఎంలపై, వీవీప్యాట్లపై, ప్రజాస్వామ్యంపై, ఎన్నికలపై, ప్రజలపై విశ్వాసం లేదు.అలా విశ్వాసం లేని వారు రాజకీయాలలో పనికిరారు. ఆయనకు ఎవరిపై దేనిపై విశ్వాసం ఉందో చెప్పమనండి' అని అన్నారు.