హామీల బాబు.. అంతా డాబు! | Babu assurance throughout the lavishly ..! | Sakshi
Sakshi News home page

హామీల బాబు.. అంతా డాబు!

Published Mon, Nov 3 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

హామీల బాబు.. అంతా డాబు!

హామీల బాబు.. అంతా డాబు!

రాష్ట్రంలో టీడీపీ సర్కార్ కొలువుదీర గానే ప్రజలందరికీ కష్టాలు మొదలయ్యాయి. బాబు రాగానే పింఛన్ పెరుగుతుంది.. మరింత ఆసరాగా ఉంటుందనుకుంటే పరిస్థితి అందుకు ....

రాష్ట్రంలో టీడీపీ సర్కార్ కొలువుదీర గానే ప్రజలందరికీ కష్టాలు మొదలయ్యాయి. బాబు రాగానే పింఛన్ పెరుగుతుంది.. మరింత ఆసరాగా ఉంటుందనుకుంటే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. ఉన్న పింఛన్లు పోయి అవ్వాతాత, వికలాంగులు, వితంతువులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు.

చంద్రన్న వస్తే రుణాలు మాఫీ అవుతాయనుకుంటే రివాల్వింగ్ ఫండ్‌తో సరిపెట్టడంతో పొదుపు మహిళల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ పరిస్థితికి తోడు ప్రకృతి కూడా సహకరించకపోవడంతో రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. కనీసం రుణాల మాఫీతోనైనా అండగా నిలుస్తారనుకుంటే అదీ కార్యరూపం దాల్చకపోవడం రైతన్నను కలవరపరుస్తోంది.మొత్తంగా జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల్లో  ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తమవు తుండగా.. ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి.
 - కర్నూలు,
 (అగ్రికల్చర్)
 
 కరువును పట్టించుకోరా
 జిల్లాలో ఏకంగా 42 మండలాల్లో కరువు నెలకొన్నా ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ జూన్ నుంచి అక్టోబర్ వరకు పరిశీలిస్తే ప్రతి నెల అంతంతమాత్రంగానే వర్షాలు ఉన్నాయి. వర్షాధారంపై జిల్లాలో దాదాపు 5.25 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల ప్రభావం 4 లక్షల హెక్టార్లపై ఉంది. పంట దిగుబడులు సాధారణం కంటే బాగా పడిపోయాయి. పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, కొర్ర, ఆముదం పంటల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వం  కరువును పట్టించుకున్న దాఖలాలు లేవు.
 
 మహిళా సంక్షేమం ప్రశ్నార్థకం
 సాధారణ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం డ్వాక్రా రుణాలు మాఫీ అంటూ చంద్రబాబునాయుడు వాగ్ధానాలు చేశారు. అధికారంలోకి రాగానే రుణాల మాఫీ లేకుండా కేవలం సంఘానికి రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్ ఇస్తామనడంపై పొదుపు మహిళల్లో అసంతృప్తి సెగలు కక్కుతోంది. ఇంతవరకు ఈ సంఘాలకు రూ.75 కోట్లు కూడా రుణాలుగా ఇవ్వలేదంటే మహిళాభ్యున్నతి ఎలా సాధ్యం అనే ప్రశ్న వస్తోంది.
 
 రేషన్‌కార్డుల కోతతో గగ్గోలు
 ఆధార్ లింకప్‌తో అడ్డుగోలుగా రేషన్ కార్డులను తీసేయడంతో జిల్లా వ్యాప్తంగా అసంతృప్తి మంటలు రాజుకున్నాయి. జిల్లాలో 11.70 లక్షల కార్డులు ఉండగా, వీటిలో ఏకంగా 1.30 లక్షల కార్డులను ఆధార్ లేనందున బోగస్‌గా ప్రకటించడంపై నిరసన వ్యక్తమవుతోంది. 11 లక్షల మందిని రేషన్ కార్డుల నుంచి తొలగించారు. రేషన్ కార్డులను కోల్పోయినవారు నేడు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉన్నత న్యాయస్థానం సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ లింకప్ చేయరాదని పేర్కొన్నా పట్టించుకోకపోవడంపై నిరసన వెల్లువెత్తుతోంది.
 
 పత్తి, మొక్కజొన్నకు ఎంఎస్‌పీ కరువు
 జిల్లాలో ప్రధానంగా పత్తి సాగు చేశారు. దాదాపు 3 లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. వర్షాభావంతో దిగుబడులు తగ్గినా మద్దతు ధరలు మాత్రం లభించడం లేదు. క్వింటాలుకు రూ.4,050 ఎంఎస్‌పీ ఉండగా మార్కెట్‌లో రైతులకు లభిస్తున్న ధర రూ.3,600 వరకే.

ఈ పరిస్థితుల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు కేంద్రాలు పెట్టించాల్సి ఉన్నా అతీగతీ లేదు. మొక్కజొన్నకు మద్దతు ధర లభించక రైతులు అల్లాడుతున్నారు. దీనికి కనీసం మద్దతు ధర రూ. 1,310 ఉండగా, మార్కెట్‌లో రూ.1000 కూడా ధర లభించడం లేదు. దీనిపై ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాల్సి ఉంది.
 
 పింఛన్లు తీసేసి ఆసరా లేకుండా చేశారు

 పింఛన్లకు ఇచ్చే మొత్తం పెంచినట్లే పెంచి అడ్డుగోలుగా కోత కోయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 3.25 లక్షల పింఛన్లు జిల్లాలో ఉండగా వివిధ నిబంధనలు ఆధార్ పేరుతో 1.05 లక్షల పింఛన్లు తొలగించి 2.20 లక్షల పింఛన్లకు పరిమితం చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు సెగలు కక్కుతున్నాయి.

పింఛన్ల కోసం దరఖాస్తులు భారీగానే ఉండగా, కేవలం 18 వేల కొత్త పింఛన్లు మాత్రమే ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 5 ఎకరాలలోపే భూమి ఉండాలనడం, 65 ఏళ్లకు పైబడి వయస్సు ఉండాలని నిబంధన పెట్టడం, నెలసరి ఆదాయం రూ.5 వేలకు మించరాదనే నిబంధనలతో పింఛన్లు తొలగించడంపై అసంతృప్తి రాజుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement