మోసపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు
అనంతపురం మెడికల్ :
మోసపు హామీలతో ఓట్లను దండుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని సీఐటీయూ నాయకులు దుయ్యబట్టారు.
అనంతపురం మెడికల్ :
మోసపు హామీలతో ఓట్లను దండుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని సీఐటీయూ నాయకులు దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగమిస్తానని ప్రకటించి ఉన్న ఉద్యోగులను కూడా ఇంటికి పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్ర హించారు. హామీల విషయంలో మాట తప్పితే ప్రజలే నీ మెడలు వంచి గద్దె దించుతారని హెచ్చరించారు. మంగళవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం ఎదుట ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్ల సంఘం (ఆశ) జిల్లా మహాసభ నిర్వహించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవేణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి 200 హామీలు, ఎన్నికల మేనిఫేస్టోలో మరో 300 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. గద్దెనెక్కిన తరువాత ఈ వంద రోజుల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేయించుకుని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు... అవినీతి పక్షాళన అంటూ ఇప్పుడు ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారని ఆగ్రహించారు. ప్రక్షాళన పేరుతో ఏ ఒక్కరిని తొలగించినా భారీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు ఇంటి అద్దె రూ.40 వేలకు పెంచే విషయంలో ఉన్న ఉత్సాహం ఆశ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వడంలో లేదని ఆగ్రహించారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.13 వేలు చెల్లించి, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, తదితర తీర్మానాలను మహాసభలో ఆమోదించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు శ్యామల, ఎన్‌జీఓ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్రమోహన్, యునెటైడ్ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మన్న, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈశ్వరయ్య, అంగన్‌వాడీ వర్కర్ల సంఘం కార్యదర్శి వనజమ్మ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.