క్లిష్ట లెక్కలకు సమాధానం వేద గణితం | Vedic mathematics is the answer to a difficult math problems | Sakshi
Sakshi News home page

క్లిష్ట లెక్కలకు సమాధానం వేద గణితం

Published Fri, Sep 5 2014 3:35 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

కలం, కాగితం అక్కరలేదు.. ఎంతటి క్లిష్టమైన లెక్కనైనా చిటికెలో ఛేదించగల మేధావి అతను.. అంకెలెన్ని ఉన్నా కూడికలు, తీసివేతలను ఇట్టే చేసేస్తారు.

  • గిన్నిస్ వరల్ట్ రికార్డు గ్రహీత సాయికిరణ్
  • కలం, కాగితం అక్కరలేదు.. ఎంతటి క్లిష్టమైన లెక్కనైనా చిటికెలో ఛేదించగల మేధావి అతను.. అంకెలెన్ని ఉన్నా కూడికలు, తీసివేతలను ఇట్టే చేసేస్తారు.   70 అంకెల సంఖ్య నుంచి మరో 70 అంకెల సంఖ్యను కేవలం 60 సెకన్ల వ్యవధిలో తీసివేసి (సబ్‌ట్రాక్షన్) గిన్నిస్ రికార్డు సృష్టించారు. తన గణిత ప్రతిభతో  వివిధ స్థాయిల్లో మరో ఆరు రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆయనే హైదరాబాదుకు చెందిన ఇంపాక్ట్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ సాయికిరణ్. తన ప్రతిభకు కారణం వేద గణితం నేర్చుకోవడమేనని ఆయన చెబుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి వేద గణితాన్ని అభ్యసించాలని సూచిస్తున్నారు.  కైకలూరు నేషనల్ స్కూల్ విద్యార్థులకు వేద గణితంలో  చిట్కాలు చెప్పడానికి వచ్చిన సాయికిరణ్‌తో  ‘సాక్షి’ ముచ్చటించింది.     
     
     ప్రశ్న : వేద గణితం అంటే ఏంటి?
     సాయికిరణ్ : వేద గణితం ప్రాచీన భారతీయ గణిత శాస్త్రం. పూర్వం రుషులు  గురుకులాలలో కొన్ని సూత్రాల ద్వారా గణితం బోధించేవారు. ప్రస్తుత గణిత పద్ధతులకు తల్లి వంటిది వేద గణితం. 1884 దశకంలో భారతీ తీర్థ కృష్ణ మహావీర్ దీనిని అభివృద్ధి పర్చారు. ఇందులో 16 సూత్రాలు, 13 ఉప సూత్రాలు ఉంటాయి.
     
     ప్ర : వేద గణితం, అబాకస్ మధ్య తేడా ఏంటి ?

     సాయికిరణ్ : అబాకస్ అనేది చైనీయుల గణితం.  ఓ చెక్క వస్తువు ద్వారా కొన్ని పద్ధతులు బోధిస్తారు. ఇందులో 6 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వయసున్న బాలబాలికలకు లెక్కలు నేర్పుతారు. వేద గణిత పద్ధతులు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలవు. చిన్నారులకు సులభంగా అర్థమవుతుంది.
     
     ప్ర : వేద గణితంపై మీకు మక్కువ ఎలా కలిగింది ?
     సాయికిరణ్ : మాది హైదరాబాదు. నాకు చిన్ననాటి నుంచి లెక్కలంటే ఎంతో ఇష్టం. వేద గణితంలోని నిష్టాతులైన ప్రొఫెసర్ తిరుత్తవ దాస్, డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ వంటి వారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు, నాలుగు వరల్ట్ రికార్డులు, రెండు జాతీయ రికార్డులు సాధించాను. 10 దేశాల్లో  వేద గణితంపై సెమినార్‌లు నిర్వహించా.
     
     ప్ర : పురాతన యుద్ధ పద్ధతులకు నేటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానికి పోలిక ఉందా?
     సాయికిరణ్ : పూర్వ రామాయణ, మహాభారత కాలాల్లో బ్రహ్మాస్త్రం, నాగాస్త్రం, పాశుపతాస్త్రం, పుష్పక విమానం, అదృష్టశక్తి, దివ్వ దృష్టి వంటివి ఉండేవని పురాణాలు చెబుతున్నాయి. అవే విమానం, మిసైల్స్, టెలివిజన్ వంటివి తయారీకి ప్రేరణ.  పూర్వం రుషులు గ్రహణ సమయాలను గవ్వలు వేసి చెప్పేవారు.
     
     ప్ర : వేదగణిత శాస్త్రవేత్తల్లో ప్రముఖులు ఎవరు ?
     సాయికిరణ్ : భారతదేశంలో అనేక మంది వేద గణితాన్ని అవపోసన పట్టారు. కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టారు. ఆర్యభట్ట, పాణిణి, పింగ ళ, వరాహమీరా, బ్రహ్మగుప్తా, మహావీరా, భాస్కర, శ్రీధర, పావులూరి మల్లన్న వంటి వారు వే ద గణితంలో దిట్టలు. ప్రస్తుతం చాలా తక్కువ మంది  ఉన్నారు.
     
     ప్ర : ప్రస్తుత విద్యార్థులకు వేద గణితం ఆవశ్యకత ఏంటి ?

     సాయికిరణ్ : వేద గణిత పద్ధతుల ద్వారా కష్టతరమైన అర్థమెటిక్స్, ఆల్‌జిబ్రా, జియోమెట్రీ, ట్రిగొనోమెట్రీ, రీజనింగ్ వంటి గణిత ప్రశ్నలకు సులభ పద్దతులతో జవాబులు తెలుసుకోవచ్చు. సాధారణ విద్యార్థి కంటే వేద గణిత విద్యార్థికి 30 శాతం నుంచి 40 వరకు వరకు జ్ఞాపకశక్తి ఎక్కువుగా ఉంటుంది. వేద గణితంలో ఎడమ నుంచి కుడికి రాస్తారు. కుడి,ఎడమల  మొదడు పరస్పర సహకారంతో పనిచేస్తుంది.
     
     ప్ర : నేటి యువతకు మీరిచ్చే సందేశం ?
     సాయికిరణ్ : నేడు యువతను నిరుద్యోగ సమస్య పీడిస్తోంది. నిత్య జీవితంలో ఏదో ఒక లెక్క లేకుండా జీవనం సాగదు. మన ప్రాచీన సంప్రదాయ వేద గణితాన్ని నేర్చుకుని, విద్యార్థులకు బోధన చేయటం వల్ల ఉపాధి పొందవచ్చు.  ప్రభుత్వం కూడా వేద గణితానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement