కాపులను బీసీల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను వాయిదా వేసుకున్నట్టు ముద్రగడ పద్మనాభం గురువారం ప్రకటించారు.
కాకినాడ (తూర్పు గోదావరి జిల్లా) : కాపులను బీసీల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్టు ముద్రగడ పద్మనాభం గురువారం ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని ఆయన తెలిపారు. విద్యార్థుల పరీక్షల దృష్ట్యా దీక్షను వాయిదా వేస్తున్నట్లు ముద్రగడ చెప్పారు.
ఉద్యమం వాయిదా వేయాలని కాపు విద్యార్థులు కోరారని, మా జాతి కోసం ఇతర విద్యార్థులు నష్టపోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. నిరాహార దీక్ష విషయంలో పూర్తిగా సొంత నిర్ణయమే ఉంటుందని, జాతి కోసం ముందు నేనే బలి కావాలని కోరుకుంటాను తప్ప ఇతరులు బలి కావాలని కోరుకోనని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనపై అమాయకులపై కేసు పెట్టి వేధిస్తే మాత్రం తాను రోడ్డెక్కుతానని హెచ్చరించారు. సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తాను దీక్ష చేయాలా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. తాను రాసిన లేఖల వల్లే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించారని తెలిపారు. తనను తిడుతున్న మంత్రులు కాపులకిచ్చిన హామీలను అమలు చేయిస్తారా? అంటూ ప్రశ్నించారు. హామీలన్నీ అమలుచేస్తామని చెప్తే ఉద్యమం నుంచి తప్పుకుంటా' అని ముద్రగడ స్పష్టం చేశారు.