కరెంటు కట్ కట | power cut problems | Sakshi
Sakshi News home page

కరెంటు కట్ కట

Published Tue, Oct 8 2013 3:00 AM | Last Updated on Wed, Sep 5 2018 1:52 PM

రాజధాని నగరానికి సమైక్య సెగ తాగింది. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సిటీలో చీకట్లు అలముకుంటున్నాయి. కోర్ సిటీలో రెండు,

 రాజధాని నగరానికి సమైక్య సెగ తాగింది. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సిటీలో చీకట్లు అలముకుంటున్నాయి. కోర్ సిటీలో రెండు, శివారు ప్రాంతాల్లో ఆరు గంటల పాటు అనధికారిక విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరఫరా నిలిపివేస్తుండటంతో సిటీజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క ఉస్మానియాతో పాటు మిగతా ప్రధాన ఆస్పత్రుల్లో ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ పనిచేయక రోగులు అవస్థలు పడుతున్నారు.
 
 సాక్షి, సిటీబ్యూరో :రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలోని విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో విజయవాడ, రాయలసీమ థర్మల్  విద్యుత్ ప్లాంట్లతో పాటు శ్రీశైలం హైడల్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా ఆయా కేంద్రాల నుంచి నగరానికి రావాల్సిన కోటాపై కోత పడింది. ప్రస్తుతం గ్రేటర్ అవసరాలు తీర్చాలంటే రోజుకు సుమారు 1800 మెగవాట్ల విద్యుత్ అవసరం కాగా 1400 మెగవాట్లకు మించి సరఫరా కావ డం లేదు. సరఫరాకు డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాసం నమోదవుతోంది. అధికారులు ఈ లోటును పూడ్చేందుకు లోడ్ రిలీఫ్, లైన్ల పునరుద్ధరణ పేరుతో అనధికారిక విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. దీంతో చిన్న చిన్న వ్యాపారులు, ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్ల నిర్వహకులు, వెల్డింగ్‌వర్కర్లు, జ్యూస్‌సెంటర్లు, పిండిగిర్నీల యజమానులు రోజువారీ ఆదాయాన్ని కోల్పోవాల్సి వ స్తోంది. ప్రతి అరగంటకోసారి లైన్స్ ఆఫ్ చేసి ఆన్ చేస్తుండటంతో గృహాల్లో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోతున్నాయని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 రోగులకు తప్పని తిప్పలు
 అనధికారిక కోతలతో గృహవినియోగదారులు, పరిశ్రమలకే కాదు.. ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్, గాంధీ, ఫీవర్, సరోజినీదేవి, ఈఎన్‌టీ, ఛాతీ, ఎంఎన్‌జే, మానసిక ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఆరోగ్యశ్రీ వార్డుల్లోని కంప్యూటర్లు మూగబోతుండటంతో రోగుల అడ్మిషన్లలో జాప్యం జరుగుతోంది. అంతే కాదు.. ఈసీజీ, టూ డీఎకో, ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ, ఆల్ట్రాసౌండ్ పనిచేయక పరీక్షలు నిలిచిపోతున్నాయి. లిప్ట్‌లు పని చేయక పై అంతస్తుల్లోని వార్డులకు చేరుకునేందుకు రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక నగరంలోని అర్బన్‌హెల్త్ సెంటర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో క్యాన్సర్ రోగులకు రేడియేషన్ చికిత్సల్లో తీవ్ర ఆటంకం కలుగుతోంది.
 
 కోతలపై సమాచారం ఇవ్వని డిస్కం
 నగరంలో గత మూడు రోజుల నుంచి ఎడాపెడా కోతలు అమలు జరుగుతున్నా... వీటిపై డిస్కం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయకపోవడం విశేషం. కనీస ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరఫరా నిలిపి వేస్తుండటంతో సిటీజనులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మంచినీరు సరఫరా అవుతున్న సమయంలో ఇంట్లో కరెంట్ లేకపోవడంతో మోటార్లు పని చేయడం లేదు. అపార్ట్‌మెంట్లకు నీరు అందడం లేదు.
 
   సిటీలో కోతల తీరు ఇలా..
 చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, ఏజీ వర్సిటీ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి అరగంటకోసారి సుమారు ఆరు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
 గచ్చిబౌలి, శేర్లింగంపల్లి, నల్లగండ్ల, హైదరాబాద్ యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లో మూడుగంటలు
 చార్మినార్, దారుషిఫా, చంచల్‌గూడ తదితర ప్రాంతాల్లో ఉదయం 10-30 నుంచి 12 గంటల వరకు
 కూకట్‌పల్లిలో ఉదయం గంటన్నర, సాయంత్రం గంట చొప్పున
 అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు
 చంపాపేట్, కర్మన్‌ఘాట్, సంతోష్‌నగర్, ఐఎస్‌సదన్, బీఎన్‌రెడ్డి, తదితర ప్రాంతాల్లో సుమారు మూడు గంటలు
     ఉప్పల్, తార్నాక, నాచారం, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో మూడు గంటలు
 
  నిలోఫర్‌లో విద్యుత్‌కు అంతరాయం
 నాంపల్లి : విద్యుత్ అంతరాయంతో నిలోఫర్ ఆసుపత్రి వైద్యాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో సోమవారం ఉదయం రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో నవజాత శిశువులు ఉక్కపోతతో అలమటించిపోయారు. పనిచేయాల్సిన రెండు జనరేటర్లు మొరాయించినట్లు తెలిసింది. నిలోఫర్‌లో 100-150 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతుంటారు. రోజుకు 15 నుంచి 20 వరకు ఆపరేషన్లు జరుగుతుంటాయి. వెయ్యికి పైగా ఓపీ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోతే పనిచేసే రెండు జనరేటర్లు సరపోవని పలువురు వైద్యులు చెబుతున్నారు. 24 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడితే నవజాత శిశువులకు ప్రమాదకరం. ఎంతోమంది గర్భిణుల సిజేరియన్ ఆపరేషన్లు నిలిచిపోతాయి. కాగా ఈ విషయమై నిలోఫర్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ  సోమవారం రెండు గంటల పాటు విద్యుత్ అంతరాయం కలిగిందన్నారు. గంటా రెండు గంటలు సరఫరా నిలిచిపోతే పెద్ద ప్రమాదం ఏమి ఉండదని, ఎక్కువ సేపు విద్యుత్ సరఫరా నిలిచిపోతే మాత్రం చిన్న పిల్లలకు ఇబ్బందవుతుందని అన్నారు.    
 
 వ్యాపారం లేక విలవిల్లాడుతున్నాం
 అనధికారికంగా రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల వరకు కరెంటు పోతోంది. గత నాలుగు రోజుల నుంచి వ్యాపారం సగానికి పైగా పడిపోయింది. అసలే పండుగ సీజన్. వ్యాపారం లేక ఏడుపొస్తోంది. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అధికారులు కూడా ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండానే కరెంటు తీసేస్తున్నారు. అదేమని ప్రశ్నించినా సప్లై లేదు మేమేం చేస్తామని సమాధానం ఇస్తున్నారు.
 - దాసు నవ్య, ఇంటర్‌నెట్ నిర్వాహకురాలు, తార్నాక
 
 ఇబ్బందులు పడుతున్నాం
 ఎల్‌బీనగర్ సర్కిల్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కోతలను విధిస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలో వచ్చే కోతలు సీమాంధ్ర సమ్మె వల్ల వర్షాకాలంలో రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కోతలు లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.
 - పగిళ్ల భూపాల్‌రెడ్డి, ఆర్‌కేపురం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement