
అమెరికాపై సైబర్ దాడి
అమెరికాలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ట్విటర్, అమెజాన్, స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్, టంబ్లర్, రెడిట్ వంటి ప్రముఖ వెబ్‌సైట్
ట్వీటర్, అమెజాన్, పేపాల్, నెట్‌ఫ్లిక్స్‌తో సహా స్తంభించిన వందల సైట్లు
► ఇంటర్నెట్ రూట్లు, ట్రాఫిక్ నియంత్రణ సంస్థపై హ్యాకర్ల దాడి
► హ్యాకింగ్‌లో కొత్త పుంతలు... వెబ్ కెమెరాలు, రూటర్లు, డీవీఆర్‌ల సాయం
► మిరాయ్ సాఫ్ట్‌వేర్ కోడ్ సాయంతో వైరస్ అటాక్
►11 గంటలు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన ఇంజనీర్లు
►అమెరికా తూర్పు కోస్తా, కాలిఫోర్నియాతో పాటు యూరప్‌పైనా ప్రభావం
వాషింగ్టన్: అమెరికాలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ట్విటర్, అమెజాన్, స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్, టంబ్లర్, రెడిట్ వంటి ప్రముఖ వెబ్‌సైట్ సేవలు నిలిచిపోయాయి. ఏం జరుగుతుందో తెలియక కోట్ల మంది వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గుర య్యారు. నగదు బదిలీకి వాడే పేపాల్ పనిచేయకపోవడంతో అయోమయం నెలకొంది. ఇంటర్నెట్‌కు అనుసంధానమైన వెబ్‌కామ్‌లు, రూటర్లు, సెట్‌టాప్ బాక్సులు, డీవీఆర్‌ల సాయంతో హ్యాకర్లు సైబర్ దాడి చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అమెరికాలో ఇంటర్నెట్ రూట్లతో పాటు ట్రాఫిక్‌ను నియంత్రిస్తోన్న న్యూ హ్యాంప్‌షైర్‌కు చెందిన డైన్ కంపెనీ(ఐఎస్‌పీ)పై దాడితో సమస్య వెలుగులోకి వచ్చింది.
శుక్రవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో(భారత కాలమానం) దాడి జరగగా.... ఇంజినీర్లు శ్రమించి రెండు గంటల అనంతరం సేవల్ని పునరుద్ధరించారు. రాత్రి 8.30 గంటల సమయంలో మళ్లీ దాడి జరగడంతో డైన్ కంపెనీ సర్వర్లు నిలిచిపోయాయి. దీంతో మూడు గంటల పాటు సేవల్ని నిలిపివేసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి తెచ్చామని, అన్ని సైట్ల సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆ కంపెనీ ప్రకటించింది. డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్‌ల (డీడీఓఎస్) ముప్పు ఉందంటూ గతవారమే అమెరికా అంతర్గత భద్రతా విభాగం హెచ్చరించింది.
సర్వర్లపై డీడీఓఎస్‌ల దాడి
డైన్ వెల్లడించిన వివరాల మేరకు... ‘వె బ్‌సైట్ డొమైన్‌లను హ్యాకర్లు టార్గెట్ చేశారు. డీడీఓఎస్ పేరిట వేలకొద్దీ అభ్యర్థనలు(రిక్వెస్ట్స్) మా సర్వర్లపై దాడి చేశాయి’ అని పేర్కొంది. అమెరికా తూర్పు కోస్తా ప్రాంతంలోని డీఎన్‌ఎస్(డొమైన్ నేమ్ సిస్టమ్)పై డీడీఓఎస్‌లు దాడి చేశాయని డైన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ హిల్టన్ తెలిపారు. ఇది ఎవరు చేశారనేది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. సీఎన్‌ఎన్, ద గార్డియన్, వైర్డ్, హెచ్‌బీఓ వంటి సైట్లు కూడా పనిచేయలేదని ప్రముఖ టెక్నాలజీ వెబ్‌సైట్ గిజ్‌మోడో తెలిపింది.
డౌన్‌డిటెక్టర్.కామ్ సమాచారం ప్రకారం... అమెరికా తూర్పు తీర ప్రాంతం, టెక్సాస్ రాష్ట్రాల్లో లెవల్ 3 సమాచార వెబ్‌సైట్ల సేవల్లో అంతరాయం ఏర్పడింది. అనంతరం అమెరికా తూర్పు మధ్య ప్రాంతం, కాలిఫోర్నియాల్లో కూడా అనేక వెబ్‌సైట్ల సేవలు ఆగిపోయాయి. యూరప్‌లో కూడా నెట్‌ఫ్లిక్స్, ట్విటర్ వంటి వైబ్‌సైట్లు నిలిచిపోయాయి. తూర్పు యూరప్‌లోని యూజర్లకు కొద్దిసేపు తమ సేవలు నిలిచిపోయినట్లు అమెజాన్ వెబ్ సేవల విభాగం తెలిపింది. శుక్రవారం రాత్రి లండన్‌లో ట్విటర్‌తో పాటు మరికొన్ని సైట్లు పనిచేయలేదు. కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయితే తమ నెట్‌వర్క్‌లు ప్రభావితం కాలేదని పేపాల్ సంస్థ వెల్లడించింది.
డైన్ సంస్థ అధికారి కైలే యార్క్ మాట్లాడుతూ... ‘చాలా తెలివిగా దాడి చేశారు. మేం సమస్యను పరిష్కరించగానే... మళ్లీ దాడి మొదలుపెట్టేవారు. ప్రతీసారి అలాగే జరిగింది’ అని తెలిపారు. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో రంగంలోకి దిగిన అమెరికా అంతర్గత భద్రతా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షించారు.
హ్యాకర్లకు వరంగా మిరాయ్ ప్రోగ్రాం
సులువుగా వాడే మిరాయ్ ప్రోగ్రాం ఆధారంగా హ్యాకర్లు దాడికి పాల్పడ్డట్లు గుర్తించారు. హ్యాకర్లు వినియోగించే డార్క్ వెబ్‌లో మిరాయ్ ప్రోగ్రాం కోడ్ ఎప్పటినుంచో అందుబాటులో ఉంది. ఈ ప్రోగ్రాం ద్వారా నెట్‌కు అనుసంధానమైన పరికరాల్ని చాలా సులువుగా తమ అధీనంలోకి తెచ్చుకోవచ్చు. సమాచారాన్ని దొంగిలించే ఈమెయిల్స్(ఫిషింగ్ మెయిల్స్)లోని మాల్‌వేర్(వైరస్)ను వాడుకుని మిరాయ్ సా్‌ఫ్ట్‌వేర్‌తో కంప్యూటర్ లేదా నెట్‌వర్క్‌లపై దాడి చేస్తారు. అనంతరం డిజిటల్ వీడియో రికార్డర్లు(డీవీఆర్), కేబుల్ సెట్ టాప్ బాక్సులు, రూటర్లు, వెబ్ కెమెరాలకు వైరస్ వ్యాపిస్తుంది. ప్రస్తుత దాడి ఇలానే జరిగిందని నిపుణులు భావిస్తున్నారు. మిరాయ్ ప్రోగ్రాం కోడ్ నెల క్రితమే ఇంటర్నెట్‌లో పెట్టారని, నేర బృందాలు ఆ కోడ్‌ను సైబర్ దాడులకు వినియోగిస్తోందని ఫ్లాష్ పాయింట్ భద్రతా పరిశోధన డెరైక్టర్ అల్లిసన్ నిక్సన్ పేర్కొన్నారు.