
అరవింద్ స్వామి
‘‘నాకు రాజకీయాలు తెలియవు. అందుకే.. రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు’’ అన్నారు అరవింద్ స్వామి. ‘కడల్’ సినిమాతో నటుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆయన నటించిన తాజా చిత్రం ‘భాస్కర్ ఒరు రాస్కెల్’. ఇందులో అమలా పాల్ కథానాయిక. మలయాళ దర్శకుడు సిద్ధిక్ తెరకెక్కించిన ఈ సినిమా మే 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించింది.
అరవింద్ స్వామి మాట్లాడుతూ– ‘‘నేను రాజకీయాల గురించి మాట్లాడటంగానీ, రావడంగానీ జరగదు. అయితే.. రాజకీయ నాయకుల నిర్ణయాలు సామాన్య ప్రజలపై ప్రభావం చూపితే స్పందిస్తా’’ అన్నారు. సినిమా గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘భాస్కర్ ది రాస్కెల్’ చిత్రానికి రీమేక్ ‘భాస్కర్ ఒరు రాస్కెల్’. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు నచ్చుతుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందర్నీ మా సినిమా అలరిస్తుంది’’ అన్నారు.