
ముంబై: కాలం అనుకూలిస్తే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ ఏడాదిలోనే ఓ ఇంటివాడయ్యేవాడు. అతనికి పెళ్లి చేయాలన్న తండ్రి కల నెరవేరేది. కానీ అంతలోనే మాయదారి డిప్రెషన్‌తో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు లోనైన అతని స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. అతడు నవంబర్‌లో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని తెలిపారు. ఇందుకోసం తండ్రితోనూ చర్చించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ అమ్మాయి వివరాలు మాత్రం వెల్లడించలేదు. మరోవైపు మూడు రోజుల క్రితం సుశాంత్ కుటుంబ సభ్యులు.. నటుడికి ఫోన్ చేసి సంభాషించారు. కరోనా వ్యాపిస్తున్న వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ నివాసంలో నుంచి బయట అడుగు పెట్టవద్దని కోరారు. (సుశాంత్ ఆత్మహత్య : విలపించిన సోదరి)
ఇంట్లోనే ఉండాలంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఈ సందర్భంగా సుశాంత్ కూడా ఓ మాట కోరాడు. తన తండ్రిని బాగా చూసుకోండంటూ సూచించాడు. కాగా ఆదివారం ఉదయం సుశాంత్ సింగ్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్ ఇక లేడన్న వార్తను అతని కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నేడు(సోమవారం) సాయంత్రం నటుడి అంత్యక్రియలు జరగనుండగా పాట్నా నుంచి అతని తండ్రితోపాటు బంధువు, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ, ఇతర బంధువులు ముంబైకి చేరుకున్నారు. (సుశాంత్ ఆత్మహత్య: మాజీ ప్రేయసి స్పందన)