
సాక్షి, న్యూఢిల్లీ : అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అమెరికా వెళ్లిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తిరిగి ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నారు. అరుణ్ జైట్లీ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం కశ్మీర్‌లోని పుల్వామాలో 44మంది సీఆర్‌ఫీఎఫ్ జవానులు అసువులు బాసిన ఉగ్రదాడిపై చర్చించడానికి జరగనున్న కేబినెట్ కమిటీ సమావేశానికి కూడా హాజరవుతారని తెలిపారు.
కాన్సర్‌తో బాధపడుతున్న జైట్లీ చికిత్స నిమిత్తం జనవరి 13న న్యూయార్క్ వెళ్లారు. దీంతో తాత్కాలిక ఆర్థికమంత్రిగా పియూష్ గోయల్ జైట్లీ స్థానంలో బాధ‍్యతలను నిర్వహించారు. ఫిబ్రవరి1న పార్లమెంటులో సమర్పించాల్సిన కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను కూడా గోయల్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం గతవారమే జైట్లీ ఇండియాకు చేరుకున్నారు.
కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుల్వామా ఘటనపై సమీక్షించేందుకు రక్షణ,హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలుతోపాటు కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఇవాళ జరగాల్సిన బహిరంగ సభను కూడా ప్రధాని రద్దు చేసుకున్నారు.