
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న సీబీఐ ముడుపుల వ్యవహారంలో స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై అక్రమంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, దాన్ని కొట్టివేయాలని ఆస్తానా వేసిన పిటిషన్‌పై విచారించిన హై కోర్టు..తదుపరి ఆదేశాల వరకు ఆస్తానాను అరెస్ట్ చేయకూడదని సీబీఐని ఆదేశించింది. ఐతే తనపై దాఖలైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలన్న విజ్ఞప్తిని మాత్రం హైకోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను అక్టోబరు 29కి వాయిదా వేసింది.
తనపై దాఖలైన ఎఫ్ఐఆర్‌ను సవాల్ చేస్తూ సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు.