
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (పాత ఫొటో)
న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యక్రమానికి అతిథిగా హాజరుకావడంపై సదరు కార్యక్రమంలోనే స్పందిస్తానని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆహ్వానాన్ని అంగీకరించిన అనంతరం తనకు చాలా ఉత్తరాలు, ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పారు. వేటికీ ఇంతవరకూ స్పందించలేదని వెల్లడించారు. ఈ మేరకు బెంగాల్ దినపత్రిక ఆనంద్ బజార్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఈ నెల 7న జరిగే కార్యక్రమంలో ప్రణబ్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారతీయ జాతీయ కాంగ్రెస్(ఐఎన్‌సీ)తో ప్రణబ్‌కు 50 ఏళ్ల అనుబంధం ఉంది. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ నిర్ణయంపై స్పందించకపోయినా, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ప్రణబ్ నిర్ణయంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు ఒక అడుగు ముందుకేసి ఈ మేరకు ఆయనకు లేఖలు రాసి, నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కూడా కోరారు.
అయితే, గొప్ప నేతలను, వ్యక్తులను ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం ఇదేం కొత్తకాదు. గతంలో మహాత్మా గాంధీ, జయప్రకాష్ నారాయణ్, జవహర్ లాల్ నెహ్రూలకు సైతం ఆర్‌ఎస్‌ఎస్ ఆహ్వానాలను పంపింది.