
న్యూఢిల్లీ: దాపరికంతో కూడిన వ్యవస్థను ఎవరూ కోరుకోరని, అదే సమయంలో పారదర్శకత పేరిట న్యాయ వ్యవస్థను నాశనం చేయలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) పరిధిలోకి వస్తుందని గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ గురువారం పైవిధంగా స్పందించింది. సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి 2010లో ఈ పిటిషన్లు వేశారు. తాజాగా జరిగిన విచారణలో ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, ఆర్‌టీఐ కార్యకర్త అగ్రావాల్ తరఫున లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు.
సీజే జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును నిలుపుదలలో ఉంచింది. ఎవరూ అజ్ఞాతంలో ఉండాలని కోరుకోరని, సమాచారం ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వకూడదనే విషయంలో స్పష్టమైన రేఖ గీసుకోవాలని బెంచ్ సూచించింది. ఆర్‌టీఐ కింద న్యాయ వ్యవస్థ సమాచారం బహిర్గతం చేయకపోవడం విచారకరమని, జడ్జీలు ఏమైనా వేరే విశ్వంలో నివసిస్తున్నారా అని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. ప్రభుత్వ విభాగాలు పారదర్శకతతో వ్యవహరించాలని సూచించిన సుప్రీంకోర్టు తన విషయం వచ్చే సరికి వెనకడుగు వేస్తోందని అన్నారు.